ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. మొత్తం 23 లక్షలపైచిలుకు కేసులు నమోదవగా.. లక్షా 60 వేల మందికిపైగా వైరస్‌కు బలయ్యారు. ఒక్క ఐరోపాలోనే లక్షమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో దాదాపు మరో 30 వేల కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1867 మంది మరణించారు.
స్పెయిన్‌లో లాక్డౌన్ పొడిగింపు..
కరోనా ధాటికి తీవ్రంగా ప్రభావితమైన స్పెయిన్‌లో కేసులు, మరణాలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 24 గంటల్లో అక్కడ 565 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 20 వేలు దాటింది. కేసులు 2 లక్షలకు చేరువయ్యాయి.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్చి 14 నుంచి అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను మే 9 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని పెడ్రో సాంచెజ్. ఏప్రిల్ 27 నుంచి స్వల్ప సడలింపులు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇటలీలో స్థిరంగా...
ఇటలీలో కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. శనివారం మరో 3,400కుపైగా కరోనా బారినపడగా.. మరో 482 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 23 వేల 227కు చేరింది. ఐరోపాలో ఒక దేశంలో ఇవే అత్యధిక మరణాలు. ఇక్కడ లాక్డౌన్ ఆరో వారం ముగింపునకు చేరుకుంటోంది.
ఫ్రాన్స్‌లో..
శనివారం మరో 642 మంది కరోనాకు బలికాగా.. ఫ్రాన్స్‌లో మొత్తం మృతుల సంఖ్య 19,323కు చేరింది. కేసులు ఇప్పుడిప్పుడే క్రమంగా తగ్గుతున్నాయి. మార్చి 17 నుంచి దేశం లాక్డౌన్లో ఉండగా.. మే 11 తర్వాత సడలింపులు కుదించే అవకాశమున్నట్లు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ సంకేతాలిచ్చారు.
5 రెట్లు అధిక మరణాలు..
బ్రిటన్‌లో శనివారం మరో 888 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 15 వేల 464కు చేరింది. ఇప్పటివరకు 4 లక్షల 60 వేల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. లక్షా 14 వేలమందికి పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు యూకే కమ్యూనిటీస్ సెక్రటరీ రాబర్ట్. బ్రిటన్ రాణి ఎలిజబెత్.. ఈ నెల 21న జరగాల్సిన తన 94వ పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు.
బ్రిటన్ వ్యాప్తంగా కేర్ హోమ్స్‌లో ఉంటున్నవారిలో దాదాపు 7500 మంది కరోనా కారణంగా మృతిచెందారని కేర్ హోమ్స్ నిర్వాహకుల సంఘం 'కేర్ ఇంగ్లండ్' పేర్కొంది. అధికారిక లెక్కల కంటే.. ఇది దాదాపు 5 రెట్లు ఎక్కువంటూ డైలీ టెలిగ్రాఫ్ కథనం అందించింది.
- టర్కీలో మరో 121 మంది చనిపోగా.. మొత్తం 1890 మంది కొవిడ్ కారణంగా మరణించినట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. మరో 3700 మందికిపైగా వైరస్ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 82 వేలు దాటింది.
- సింగపూర్‌లో శనివారం 942 కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్ తదితర దేశాల నుంచి వచ్చి డార్మెటరీల్లో ఉంటున్నవారిలోనే ఎక్కువగా ఈ కేసులు వెలుగుచూశాయి.
- నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారీ ప్రధాన సహాయకుడు కరోనా కారణంగా మృతి చెందినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
- రష్యాలో మరో 40 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 313కు పెరిగింది.
- పాకిస్థాన్‌లో మొత్తం 7 వేల 600కుపైగా కరోనా బారినపడ్డారు. 143 మరణాలు నమోదయ్యాయి.