అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన కారణంగా వచ్చే ఆర్థిక సంక్షోభంపై సభ్యదేశాలను హెచ్చరించారు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకేల్. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఐరోపా నుంచి ఎవరూ అమెరికాకు రాకుండా ఇటీవల ప్రయాణ నిషేధం విధించారు ట్రంప్.
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో 30 రోజులపాటు ఐరోపాకు అమెరికా ప్రజల రాకపోకలను నిషేధించారు ట్రంప్. అధ్యక్షుడి నిర్ణయం కారణంగా ఐరోపాలో ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులను తప్పించుకునేందుకు యత్నించాలని కోరారు ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు చార్లెస్ మైకేల్. పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు పేర్కొన్నారు.
"అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రయాణ ఆంక్షల అనంతర పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నాం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలను ఐరోపా సమాఖ్య తీసుకుంటోంది. బాధితుల సంఖ్య తగ్గించేందుకు, వ్యాధి నియంత్రణపై పరిశోధన సాగించేందుకు చర్యలు తీసుకున్నాం."