EU sanctions on Russia: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే తాజాగా రష్యాలోని అధికారులు, చట్టసభ్యులు, పలు సంస్థలపై ఆంక్షలు విధించింది యూరోపియన్ యూనియన్.
"ఉక్రెయిన్లోని రెండు ప్రాంతాలకు స్వతంత్రత ప్రకటించడంలో సహకరించిన రష్యా పార్లమెంటులోని 351 మంది సభ్యులపై యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. వీరితో పాటు 27 మంది ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు, బ్యాంకులు, వ్యాపారవేత్తలు, మిలిటరీ అధికారులపైనా ఆంక్షలు వర్తిస్తాయి." అని యూరోపియన్ యూనియన్ విడుదల చేసిన ప్రకటనలో వెలువరించింది.
ఆందోళనలో ఐరాస
UN concern Russia: రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస సభ్య దేశాలు చర్చలు జరిపాలని.. ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరింది. ఈ మేరకు రష్యా చర్యలను ఆందోళనకరమైనవిగా అభివర్ణించారు ఐరాస జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్.
ఉక్రెయిన్లో ఎమర్జెన్సీ..
emergency in ukraine: ఉక్రెయిన్లో అత్యవసర పరిస్థితి విధించేందుకు ఆ దేశ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24 నుంచి 30 రోజులపాటు అత్యవసర పరిస్థితి అమల్లోకి రానుంది. ఎమర్జెన్సీ సమయంలో ర్యాలీలు, ప్రచారాలు, సమావేశాలు, సభలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు.