కరోనా అంతమే లక్ష్యంగా ఐరోపా సమాఖ్య(ఈయూ) దేశాలు సామూహిక వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాయి. దాదాపు 4.5 కోట్ల మంది ప్రజలకు టీకాను పంపిణీ చేస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ శతాబ్దంలోనే అత్యంత విపత్కర ఆరోగ్య సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఈయూ దేశాలకు కరోనా టీకా ఆశాకిరణంలా అవతరించింది.
ఈయూలోని 27 దేశాల్లో ఆదివారం ఉదయం నుంచి ప్రజలకు టీకా అందిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. టీకా సురక్షితం, భద్రం అని ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు పలువురు రాజకీయ నేతలు ప్రముఖులు మొదటగా తీసుకున్నారు.
రొమేనియాలో తొలి టీకాను మిహేలా ఆంఘెల్ అనే నర్సు తీసుకున్నారు. వ్యాక్సిన్ వల్ల తనకు కొంచెం కూడా ఇబ్బందిగా లేదని ఆమె అన్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
ఇటలీలోని స్పాలాంజనిలోనూ కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించారు. ఆ దేశంలో మొదటి కరోనా కేసు నమోదైన ప్రాంతం ఇదే. జనవరిలో చైనా నుంచి వచ్చిన దంపతులకు ఇక్కడే పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అనంతరం ఐరోపాలో కరోనా వ్యాప్తికి ఈ ప్రాంతమే కేంద్రబిందువైంది. ఇన్ని చీకటి రోజుల తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి ఇటలీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని వైరస్ నిపుణులు డొమెనికో అర్క్యూరి అన్నారు. అయితే టీకా వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. ఎప్పటిలాగే జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. కరోనా అంతమయ్యేవరకు పోరాటం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు.
జర్మనీ దిగ్గజ ఫార్మా సంస్థ బయెఎన్‌టెక్, అమెరికా ఔషధ సంస్థ ఫైజర్ సంయుక్తంగా తయారు చేసిన టీకాను ఐరోపా దేశాలు తమ ప్రజలకు పంపిణీ చేస్తున్నాయి.
ఇదీ చూడండి: కొవిడ్ సమయంలో 'ఔట్ డోర్ లెర్నింగ్'