బ్రెగ్జిట్ గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒప్పందం ఆమోదించుకునే దిశలో వడివడిగా అడుగులు వేస్తున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ఇందుకోసం పలు మార్పులు చేసి కొత్త ఒప్పందాన్ని ప్రతిపాదించారు జాన్సన్.
బ్రస్సెల్స్లో ఐరోపా నేతల సమావేశానికి ముందుగా బ్రెగ్జిట్ ఒప్పందానికి ఈయూ ప్రతినిధుల బృందం ఆమోదం లభించిందని ఆయన తెలిపారు. మంచి ఒప్పందం కోసం బ్రిటన్, ఐరోపా సమాఖ్య ప్రతినిధులు కష్టపడుతున్నారని జాన్సన్ అన్నారు. అయితే దీనికి ఇంకా బ్రిటన్, ఐరోపా చట్ట సభలు ఆమోదం తెలపాల్సి ఉందని పేర్కొన్నారు.
"మనకు ఒక కొత్త ఒప్పందం కుదిరింది. ఇది పరిస్థితులను తిరిగి నియంత్రణలోకి తెస్తుంది. ఇప్పుడు దీనికి పార్లమెంటు శనివారం ఆమోద ముద్ర వేయాలి. ఆ తర్వాత ఇతర ముఖ్యాంశాలైన జీవన వ్యయం, నేరాలు, పర్యావరణం, జాతీయ భద్రతపై దృష్టిపెట్టవచ్చు."
-బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని
సానుకూలంగా ఈయూ
బ్రిటన్ ప్రతిపాదిత కొత్త ఒప్పందాన్ని ఐరోపా కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ ప్రశంసించారు. వచ్చే గురువారం బ్రస్సెల్స్లో జరిగే సమావేశంలో ఐరోపా నేతలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాలని సూచించారు.