భారత్‌లో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన పౌరసత్వ సవరణ చట్టంపై తమ పార్లమెంట్లో తీర్మానాన్ని ప్రతిపాదించడానికి ఐరోపా సమాఖ్య ప్రతినిధులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్ అంశం సహా పౌరసత్వ సవరణ చట్టంపై ఆరు పార్టీలు ఆరు వేర్వేరు తీర్మానాలను ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. బ్రసెల్స్‌లో జనవరి 29న జరిగే సమావేశాల్లో దీనిపై చర్చించనున్నట్లు సమాచారం.
తీర్మానంలో ఏముంది?
అంతర్జాతీయ మానవహక్కుల నిబంధనలను భారత్ ఉల్లంఘించిందనే ఆరోపణలపై తాజా తీర్మానాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆర్టికల్-370 రద్దు అనంతరం జమ్ము కశ్మీర్లో రాజకీయ నాయకుల గృహనిర్బంధం, సమాచార వ్యాప్తిపై ఆంక్షలు వంటి అంశాలపైనా చర్చించనున్నట్లు సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై పోలీసుల కాల్పులు సహా నిర్బంధించి హింసించారని తీర్మానంలో పార్లమెంట్ సభ్యులు ఆరోపించారు. జాతీయ పౌర పట్టిక అమలు ద్వారా ప్రపంచంలో స్థిర నివాసం లేనివారి సంక్షోభానికి కారణమవుతుందని తీర్మానంలో పేర్కొన్నారు.
భారత్‌లో సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై ప్రభుత్వం చేపడుతోన్న చర్యలు వారి ప్రాణాలకు ముప్పుగా మారాయని తీర్మానంలో ఆరోపించారు ఈయూ పార్లమెంట్ సభ్యులు. నిరసనకారులతో చర్చించాలని ప్రధాని మోదీకి సూచించారు. కశ్మీర్లో ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. అంతర్జాతీయ బాధ్యతగా... సమానత్వాన్ని, అవివక్షతలను పాటిస్తూ సీఏఏను పునఃసమీక్షించాలని తీర్మానంలో స్పష్టం చేశారు.
భారత్ స్పందన
ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పాటు చేసినన చట్టానికి చెందిన హక్కులు, అధికారాలను తోటి ప్రజాస్వామ్య దేశాలుగా ప్రశ్నించకూడదని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.