ఒకప్పుడు సైబర్ దాడులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఉత్తర ఐరోపా దేశం ఎస్తోనియా ఇప్పుడు ఆన్లైన్లో ఎన్నికల ఓటింగ్‌ను నిర్వహించే ఏకైక దేశంగా అవతరించింది.
అంతర్జాలం ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే 'ఐ-ఓటింగ్' విధానాన్ని 2005లోనే ప్రవేశపెట్టింది ఎస్తోనియా. రష్యాతో వివాదం కారణంగా 2007లో ప్రభుత్వ నెట్‌వర్క్‌లు మొత్తం సైబర్ దాడుల బారిన పడ్డాయి
అనతి కాలంలోనే సాంకేతిక సమస్యలన్నీ అధిగమించింది ఈ దేశం. అత్యంత పకడ్బందీగా పరిష్కార మార్గాలను కనుగొంది. ప్రతి ఎన్నికల్లోనూ 'ఐ-ఓటింగ్'ను ప్రజలకు అందుబాటులో ఉంచింది.
ఆన్లైన్లో ఓటేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మార్చిలో జరిగిన ఎస్తోనియా జాతీయ ఎన్నికల్లో 44 శాతం ఓటర్లు ఆన్లైన్ ద్వారానే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
30 సెకన్లలోనే ఓటేసిన మహిళ
మే 23 నుంచి 26 వరకు ఐరోపా సమాఖ్య పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈయూలోని 28 సభ్యదేశాల్లో ఏస్తోనియా ఒకటి. 13లక్షల జనాభా ఉన్న ఈ దేశం నుంచి ఆరుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్తేనియాలో ఐ-ఓటింగ్ ప్రక్రియ మే 10న మొదలైంది. ఎన్నికల తేదీకి నాలుగు రోజుల ముందు వరకు కొనసాగనుంది.
ఐ-ఓటింగ్‌తో ఓటుహక్కు వినియోగించుకుంది లిండా లైనావూ అనే మహిళ. కేవలం 30 సెకన్లలోనే తన ల్యాప్‌టాప్‌ను ఉయోగించి ఓ కేఫ్‌లో కూర్చొని ఓటేసింది. ఆమె ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓటేసేందుకు క్యూలో నిలబడలేదు. ప్రతిసారి ఆన్లైన్ ద్వారానే ఓటింగ్‌లో పాల్గొంటుంది.
" నా జీవితంలో ఇంతకన్నా ఎక్కువ ఎలాంటి మార్పు ఊహించుకోలేను. ఓటు వేసేందుకు క్యూలో నిలబడి కాగితాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. "
-లిండా లైనావూ, ఓటరు.