మానవ మెదడును కంప్యూటర్‌తో అనుసంధానించి అద్భుతాలు సృష్టించాలన్న బలమైన కోరిక శాస్త్రవేత్తల్లో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటివరకూ అది సైన్స్ కాల్పనిక సాహిత్యానికే పరిమితమైంది. తాజాగా అంతర్జాతీయ నాడీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందం ఈ దిశగా కీలక ముందడుగు వేసింది. త్రీడీ ముద్రణ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కీలక ఇంప్లాంట్లను తయారుచేసింది. బ్రిటన్‌లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయం, రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్సిటీ, జర్మనీలోని టెక్నిష్చె యూనివర్సిటాట్ డ్రెస్డెన్ పరిశోధకులు ఈ ఘనత సాధించారు.
త్రీడీ పరిజ్ఞానంతో మెదడుతో కంప్యూటర్ల అనుసంధానం! - త్రీడీ ప్రింటెడ్ ఇంప్లాంట్స్
అంతర్జాతీయ నాడీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందం మెదడుపై చేసిన పరిశోధనలో కీలక ముందడుగు వేసింది. మానవ మెదడును కంప్యూటర్‌తో అనుసంధానించేందుకు త్రీడీ ముద్రణ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇంప్లాంట్లను తయారుచేసింది. బ్రిటన్‌లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయం, రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్సిటీ, జర్మనీలోని టెక్నిష్చె యూనివర్సిటాట్ డ్రెస్డెన్ పరిశోధకులు ఈ ఘనత సాధించారు.
మెదడును ఒక న్యూరల్ ఇంటర్‌ఫేస్ ద్వారా కంప్యూటర్‌కు అనుసంధానించడంలో ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ రంగంలో ప్రధానంగా మెదడు, నాడీ వ్యవస్థలోని చిన్నపాటి విద్యుత్ ప్రకంపనలను గ్రహించడానికి, ప్రసారం చేయడానికి ప్రత్యేక ఇంప్లాంట్లు అవసరం. వీటిని త్రీడీ ముద్రణ పరిజ్ఞానంతో తయారు చేయవచ్చని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తాజాగా రుజువు చేశారు. తాజా విధానంతో నాడీ శాస్త్రవేత్త ఫలానా డిజైన్‌లో ఇంప్లాంట్ కావాలని కోరితే.. ఇంజినీరింగ్ బృందం తొలుత ఒక కంప్యూటర్ నమూనాను సిద్ధం చేస్తుంది. అది.. త్రీడీ ముద్రణ యంత్రానికి సూచనలు జారీచేస్తుంది. వాటికి అనుగుణంగా.. శరీరంలో కలిసిపోయే, మృదువైన పదార్థాలతో సదరు ఇంప్లాంట్‌ను ఆ యంత్రం ముద్రిస్తుంది.