భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి (Covaxin WHO Approval) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమతించింది.
కొవాగ్జిన్ టీకాకు ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ హోదా ఇచ్చే విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు అదనపు సమాచారం ఇవ్వాల్సిందిగా భారత్ బయోటెక్‌ను అక్టోబర్ 26వ తేదీన టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ కోరింది. భారత్ బయోటెక్ సమర్పించిన సమాచారాన్ని విశ్లేషించిన మీదట కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి (Covaxin WHO Approval) ఇవ్వాలంటూ టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు డబ్ల్యూహెచ్ఓకు సిఫార్సు చేసింది.
లక్షణాలు ఉన్న కొవిడ్ బాధితులకు కొవాగ్జిన్ టీకాతో 77.8శాతం, డెల్టా వేరియంట్‌పై 65.2శాతం రక్షణ లభిస్తుందని ఇప్పటికే పరీక్షల్లో తేలింది. మూడు దశల్లో నిర్వహించిన పరీక్షల్లో ఈ మేరకు ఫలితాలు వెల్లడయ్యాయని భారత్ బయోటెక్ సంస్థ జూన్‌లో వెల్లడించింది.
దేశీయంగా కరోనా వ్యాక్సిన్ తయారీకి ముందు నుంచి చొరవ చూపుతూ వచ్చిన సంస్థ భారత్ బయోటెక్. ప్రపంచానికి పెను సవాలుగా మారిన కరోనా వైరస్‌కు విరుగుడును దిగుమతి చేసుకోవటం కాకుండా భారత్‌లోనే తయారు చేయాలని సంకల్పించుకుంది. ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా వేగంగా పరీక్షలు నిర్వహిస్తూ కొవాగ్జిన్ టీకాను తయారు చేసింది. బీఎస్ఎల్-3 ల్యాబ్ సౌకర్యం ఉండటం, గతంలోనూ పలు మహమ్మారులకు టీకాలు రూపొందించిన అనుభవంతో కొవాగ్జిన్ టీకాను తయారు చేసింది.
ఇదీ చూడండి :కొవాగ్జిన్ కాల పరిమితి 12 నెలలకు పొడిగింపు