భారత్‌లో కొవిడ్-19 టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం లభించటం కీలక మైలరాయిగా పేర్కొంది ప్రముఖ ఫార్మాసంస్థ ఆస్ట్రాజెనెకా. భారత్ నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ సరఫరాకు దోహదపడుతుందని తెలిపింది. తమ టీకా కోవిషీల్డ్‌కు ఇప్పటి వరకు ఆరు దేశాలు అత్యవసర వినియోగనికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది ఆస్ట్రాజెనెకా. అందులో భారత్‌తో పాటు అర్జెంటీనా, డొమినికా రిపబ్లిక్, ఎల్ సల్వడార్, మెక్సికో, మొరోకోలు ఉన్నాయి.
తమ టీకా పూర్తిగా సురక్షితమని, కొవిడ్-19ను సమర్థవంతంగా అడ్డుకుంటోందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలినట్లు వెల్లడించింది ఫార్మా సంస్థ. రెండో డోస్ వేసుకున్న తర్వాత 14 రోజులకు మించి ఆసుపత్రుల్లో ఉండటం లేదని తెలిపింది. 2021లో 300 కోట్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొంది.
" అత్యవసర వినియోగానికి ఆమోదం లభించటంతో త్వరలోనే లక్షలాది మందికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. అది ప్రపంచవ్యాప్తంగా అందరికి సమానంగా వ్యాక్సిన్ అందించాలనే మా దీర్ఘకాల నిబద్ధతకు రుజువు. ఈ మహమ్మారిపై పూర్తిస్థాయిలో ప్రభావం చూపుతుందనే నమ్మకం ఉంది. ఔషధ నియంత్రణ సంస్థలు టీకా అనుమతులపై త్వరగా, నిర్ణయాత్మకంగా చర్యలు చేపట్టినందుకు వారికి మా కృతజ్ఞతలు. అలాగే.. మా భాగస్వాములు, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాల కృషికి అభినందనలు."
- పాస్కల్ సోరియట్, ఆస్ట్రాజెనెకా సీఈఓ