Dubai ruler Sheikh Mohammed: 'రాజుల సొమ్ము రాళ్ల పాలు' అన్నది పాత సామెత. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం (72) విషయంలో బ్రిటన్ హైకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పు వింటే 'రమణుల పాలు' అని కూడా చెప్పుకోవాలేమో! తన ఆరో కళత్రంగా ఈ రాజు గారు పెళ్లాడిన జోర్డాన్ రాకుమారి హయా బింత్ అల్ హుసేన్(47)కు.. వీరిద్దరికీ పుట్టిన పిల్లలకు అక్షరాలా రూ.5,555 కోట్లు (554 మిలియన్ పౌండ్లు) కట్టితీరాలంటూ కోర్టు తీర్పు చెప్పింది.
బ్రిటిష్ చరిత్రలో అత్యధిక ఖరీదైన విడాకుల సర్దుబాటు వ్యవహారంగా దీన్ని చెబుతున్నారు. ఈ మొత్తంలో రూ.2,521 కోట్లు మాజీ భార్యకు మూడు నెలల్లోపు చెల్లించాలి. రూ.2,907 కోట్లు వీరిద్దరి పిల్లలైన అల్ జలీలా (14), జయేద్ (9)లకు బ్యాంకు గ్యారంటీతో చెల్లించాలని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. పిల్లలకు ఇవ్వాల్సిన మొత్తం తండ్రితో వారికున్న సంబంధాలపై ఆధారపడి ఉంటుందని కూడా కోర్టు పేర్కొంది. మాజీ భార్య, పిల్లల (మైనారిటీ తీరేదాకా) రక్షణ వ్యయం కింద ఏటా చెల్లించాల్సిన రూ.110 కోట్లు, పిల్లల చదువుకు మరికొంత డబ్బు కూడా పెద్ద మొత్తంలో కలిపారు. న్యాయమూర్తి ఫిలిప్ మూర్ తీర్పు చదువుతూ.. రాకుమారి హయా, ఆమె పిల్లలకు బయటి శక్తుల కంటే ఎక్కువగా భర్త షేక్ మహమ్మద్ నుంచే ముప్పు ఉన్నందున తగినంత రక్షణ అవసరమన్నారు.
ఏం జరిగిందంటే..
తన అంగరక్షకుల్లో ఒకరితో సన్నిహితంగా మెలిగినట్టుగా చెబుతున్న రాకుమారి హయా 2019 ఏప్రిల్‌లో దుబాయ్ నుంచి లండన్‌కు తిరిగి వచ్చేశారు. తనకు విడాకులు కావాలని, తన ఇద్దరు పిల్లలను అప్పగించాలని కోరుతూ బ్రిటిష్ కోర్టును ఆశ్రయించారు. జోర్డాన్ రాజు దివంగత హుసేన్ కుమార్తె అయిన ఈమె 'నా భర్త నుంచి నాకు ముప్పుంది. కుమార్తెలు ఇద్దరినీ బలవంతంగానైనా సరే.. గల్ఫ్ ఎమిరేట్‌కు వెనక్కు రప్పించాలని ఆయన చూస్తున్నారు' అని ఆరోపించారు.