చిలీలో రవాణా ఛార్జీల పెంపును నిరసిస్తూ చెలరేగిన ఆందోళనలు చిలికి చిలికి గాలివానగా మారాయి. అక్టోబర్ 18 నుంచి శాంటియాగోలో చేపడుతున్న నిరసనలతో జనజీవన స్తంభించిపోయింది. వేల మంది రోడ్లపైకి రావటం వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో వేలాది మంది గాయాలపాలయ్యారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి.
చిలీలోని ప్రస్తుత పరిస్థితులు 30 సంవత్సరాల క్రితం అగస్టో పినోచెట్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను గుర్తుకు తెస్తున్నాయి.
చిలీ నిరసనలు ఉద్రిక్తం.. 29 మంది మృతి 29 మంది మృతి..
శాంటియాగోలో ఆందోళనకారులు శుక్రవారం చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవటం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, నిరసనకారులు మధ్య ఘర్షణ నెలకొంది. ఇందులో ఒకరు చనిపోయినట్లు ఆ దేశ జాతీయ మానవ హక్కుల సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 29కి చేరింది.
ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపు..
దేశంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆందోళనకారులతో చర్చించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనలకు ముగింపు పలికే దిశగా ఆ దేశ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా ముందడుగేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా రాజ్యాంగ సవరణ చేపట్టే అవకాశం ఉందని సమాచారం.