CRUDE OIL FROM RUSSIA: ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్న మన దేశంపై అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. తక్కువ ధరకు వస్తుందని దురాక్రమణకు దిగిన దేశానికి మద్దతిస్తారా? అంటూ నిలదీస్తున్నాయి. ఘోరమైన నేరానికి పాల్పడినట్లుగా చిత్రిస్తున్నాయి. వాస్తవానికి రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల్లో చమురు సరఫరా అంశం లేదు. అదే విషయాన్ని శ్వేతసౌధ మీడియా కార్యదర్శి జెన్ సాకి ఒకవైపు అంగీకరిస్తూనే.. మరోవైపు చరిత్ర పుస్తకాల్లో భారత్ స్థానం ఎలా ఉండబోతుందో ఊహించుకోండి అంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు. చమురు కొనుగోలు ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని సమర్థిస్తున్నారని ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఒక్క మనదేశమే ఇంధనాన్ని కొంటోందా? ఇంకెన్ని దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి? అనే విషయాన్ని పరిశీలిద్దాం.
బల్గేరియా: రష్యా నుంచి సరఫరా అయ్యే చమురు ద్వారానే 60శాతం వరకూ ఆ దేశ అవసరాలు తీరుతున్నాయి. రష్యా కంపెనీ లూకోఆయిల్‌కు చెందిన భారీ చమురు శుద్ధి కర్మాగారం 'నెఫ్టోచిమ్ బర్గాస్'.. బాల్కన్ ద్వీపకల్పంలోనే ఉంది. ఇక్కడ ఉత్పత్తయ్యే చమురు అంతా బల్గేరియా అవసరాలకే.
చైనా:ఐరోపా సమాజం(ఈయూ) తర్వాత రష్యా నుంచి రెండో అతిపెద్ద చమురు దిగుమతిదారు చైనా.
ఐరోపా సమాజం(ఈయూ):27 దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఈయూ.. సహజవాయువు అవసరాల్లో 40 శాతం, ముడి చమురు అవసరాల్లో 27శాతం మేర రష్యాపైనే ఆధారపడుతోంది. ఈయూ సభ్య దేశాలు కొన్ని రష్యాపై మరిన్ని ఆంక్షలకు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆ దేశం నుంచి ఇంధన దిగుమతులను అవి కొనసాగిస్తున్నాయి. వాటిలో ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్ ఇటలీ తదితర దేశాలున్నాయి.
ఫ్రాన్స్:గత ఏడాది ఫ్రాన్స్ మొత్తం ఇంధన దిగుమతుల్లో రష్యా వాటా 9.5శాతం వరకూ ఉంది. రష్యా నుంచి డీజిల్ కొనుగోలును నిలిపివేసినట్లు చెబుతోంది.
జర్మనీ: ఈ దేశంలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం 'మిరో'కు సరఫరా అయ్యే ముడి సరకులో 14శాతం వరకూ రష్యానే అందిస్తుంది. రష్యాకు చెందిన రోజ్‌నెఫ్ట్ కంపెనీ అనుబంధ సంస్థకు జర్మనీకి చెందిన పీసీకే ష్వెద్ రిఫైనరీలో 54 శాతానికిపైగా వాటా ఉంది.
గ్రీస్:ఈ దేశంలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం 'హెలెనిక్ పెట్రోలియం'కు 15శాతం సరకు సరఫరా రష్యా నుంచే జరుగుతుంది. ఇప్పుడిప్పుడే సౌదీ అరేబియా నుంచి ఇంధన కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
ఇటలీ:రష్యా ముడి చమురు ఆధారంగానే ఐఎస్‌ఏబీ అనే భారీ రిఫైనరీ నడుస్తోంది. ఈ నెల 4వ తేదీన కూడా ఈ కర్మాగారం యథావిధిగా పనిచేసిందని సమాచారం.