తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్​ నుంచి కోలుకున్నా.. రుచీపచీ లేని జీవితం!

కరోనా బాధితుల్లో దీర్ఘకాలంపాటు వాసన, రుచి విషయంలో ఎదురవుతున్న పరిణామాలపై బ్రిటన్​ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. దాదాపు 10 శాతం మందిలో కొవిడ్​ నుంచి కోలుకున్న ఆరు నెలల తర్వాత కూడా.. రుచి, వాసన చూసే సామర్థ్యం మెరుగడటం లేదని వారి పరిశోధనలో తేలింది. దీన్ని బట్టి ఇది ఆషామాషీ ఇబ్బంది కాదని, పెను సమస్యేనని పరిశోధకులు పేర్కొన్నారు.

study on covid patients
కరోనా బాధితులపై అధ్యయనం

By

Published : Sep 27, 2021, 6:00 AM IST

కొవిడ్‌-19 బాధితుల్లో ప్రధానంగా కనిపించే లక్షణం.. రుచి, వాసన చూసే సామర్థ్యం కోల్పోవడం. అయితే దాదాపు 10 శాతం మందిలో ఆరు నెలలు దాటాక కూడా పరిస్థితి అదేరీతిలో కొనసాగుతోంది. దీన్నిబట్టి.. ఇది ఆషామాషీ ఇబ్బంది కాదని, పెను సమస్యేనని వెల్లడైంది. దీర్ఘకాలంపాటు వాసన, రుచి విషయంలో ఎదురవుతున్న సమస్యల వల్ల ఉత్పన్నమవుతున్న పరిణామాలపై బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఇందుకోసం 'ఆబ్సెంట్‌' అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేశారు.

వాసన సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోవడాన్ని 'అనోస్మియా' అంటారు. సాధారణ వాసనలు కూడా పూర్తి భిన్నంగా అనిపించడాన్ని 'పారోస్మియా'గా పేర్కొంటారు. నాలుకలోని గ్రాహకాలు రుచిని పట్టుకుంటాయి. ఆహారానికి సంబంధించిన పూర్తి జ్ఞానేంద్రియ అనుభూతిని ఫ్లేవర్‌గా పేర్కొంటారు. దీనికి వాసన సామర్థ్యమూ అవసరం. అలాగే ఇతర ఇంద్రియ జ్ఞానాలకూ ఇందులో ప్రమేయం ఉంటుంది. నాలుకకు సంబంధించిన రుచి సామర్థ్యం బాగానే ఉన్నా.. వాసన చూసే సామర్థ్యం తగ్గిపోవడం వల్ల 'ఫ్లేవర్‌'పై ప్రభావం పడుతుంది. దీర్ఘకాల బాధితుల్లో శాస్త్రవేత్తలు గమనించిన అంశాలివీ..

  • కొందరిలో వాసన, రుచి సామర్థ్యం పూర్తిస్థాయిలో తగ్గిపోతోంది. మిగతావారి విషయంలో అది వైరుధ్యాలతో ఉంటోంది. వీరిలో అనోస్మియా.. పారోస్మియాగా మారుతుంటుంది. నేడు బాగానే అనిపించిన ఆహారం.. మరుసటి రోజు అసహ్యంగా అనిపించొచ్చు.
  • వాసన సామర్థ్యం తగ్గిపోయిన పరిస్థితుల్లో జీవనం దుర్భరంగా ఉన్నట్లు కొందరు చెప్పారు.
  • బాధితుల ఆకలిపైనా ప్రభావం పడింది. తిండి తినడమే కొందరికి చాలా కష్టమవుతోంది. ముఖ్యంగా వాసన సామర్థ్యం వక్రీకరణకు గురైనప్పుడు ఈ ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తుంది.
  • అనేకమందిలో పోషకాహార లేమి, బరువు తగ్గడం వంటివి తలెత్తాయి.
  • కొందరు మాత్రం బరువు పెరిగారు. వీరంతా అనోస్మియా బాధితులే. వీరు వాసన సామర్థ్యం పూర్తిగా కోల్పోవడం వల్ల ఫ్లేవర్‌ కోసం తహతహలాడే పరిస్థితి కనిపించింది. భోజనం చేసిన భావన వీరిలో కలగకపోవడం వల్ల.. ఆ అనుభూతి కోసం అతిగా తిని, బరువు పెరిగారు.
  • ఆహారం మాత్రమే కాదు.. సన్నిహిత బంధాలపైనా ఇది ప్రభావం చూపుతున్నట్లు వెల్లడైంది. తమ జీవిత భాగస్వామి, చిన్నారులకు సంబంధించిన సహజసిద్ధ వాసనను పట్టుకోలేకపోతున్నామని, ఇది తమలో ఒంటరి భావనను కలిగిస్తోందని అనేక మంది వాపోయారు.
  • వాసన సామర్థ్యం లేకపోవడం వల్ల మరికొందరైతే ఈ ప్రపంచంతోనే తమకు సంబంధం తెగిపోయిందని ఆవేదన చెందుతున్నారు. రోజువారీగా వచ్చే కొన్ని వాసనలు కూడా తమకు భరింపరాని విధంగా ఉంటున్నాయని చెప్పారు. అందువల్ల తమకు ఈ ప్రపంచం భయానకంగా, గందరగోళంగా తోస్తోందని వివరించారు.
  • కొంతమందికి వాసనకు సంబంధించిన శిక్షణ ద్వారా.. కోల్పోయిన రుచి, వాసన సామర్థ్యాన్ని తెచ్చుకునే వీలుంది.

ABOUT THE AUTHOR

...view details