తెలంగాణ

telangana

ETV Bharat / international

'కొవిడ్​ తదుపరి వేరియంట్‌ అత్యంత ప్రమాదకరం కావొచ్చు!' - కొవిడ్​ కొత్త వేరియంట్​

Covid Next Variant: కరోనాలో పరిణామక్రమ తప్పిదం వల్లే ఒమిక్రాన్‌ తేలికపాటి వైరస్‌గా ఉందని భారత సంతతికి చెందిన పరిశోధకుడు రవీంద్ర గుప్తా తెలిపారు. అందువల్ల తదుపరి వేరియంట్‌ మరింత ప్రమాదకరంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మునుపటి వైరస్‌ రకాల తరహాలో అది చెలరేగొచ్చని హెచ్చరించారు.

Covid Next Variant
Covid Next Variant

By

Published : Jan 8, 2022, 1:54 PM IST

Covid Next Variant: కరోనాలోని ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత తక్కువగానే ఉండొచ్చన్న వార్తలు రావడం ప్రస్తుతానికి ఊరటనిచ్చే అంశమే. అయితే పరిణామక్రమం పరంగా జరిగిన పొరపాటు వల్లే ఇది తేలికపాటి వైరస్‌గా ఉందని భారత సంతతికి చెందిన పరిశోధకుడు రవీంద్ర గుప్తా తెలిపారు. అందువల్ల తదుపరి వేరియంట్‌ మరింత ప్రమాదకరంగా మారొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

ఆయన బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఒమిక్రాన్‌పై ఇటీవల పరిశోధన చేశారు. శరీర రోగ నిరోధక వ్యవస్థకు ఈ రకం వైరస్‌ మరింత స్పష్టంగా కనిపించేందుకు కారణమవుతున్న కీలక యంత్రాంగాన్ని గుర్తించారు. ఊపిరితిత్తుల్లోని కణాల్లో ఒమిక్రాన్‌ చాలా తక్కువగా ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తున్నట్లు గుప్తా గమనించారు.

"కొంతకాలం తర్వాత వైరస్‌లు తక్కువ ప్రమాదకరంగా మారతాయన్న భావన ఉంది. ఎందుకంటే దీర్ఘకాల పరిణామక్రమంలోనే అలాంటివి జరుగుతాయి. ప్రస్తుతం కరోనాకు ఈ సమస్య లేదు. ఎందుకంటే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. అందువల్ల ఇప్పటికిప్పుడు తక్కువ ప్రమాదకరంగా అది రూపాంతరం చెందడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు. అయినా ప్రస్తుతం అది ఈ విధంగా మారడానికి కారణం.. పరిణామక్రమంపరంగా జరిగిన తప్పిదమే. ఇది వైరస్‌ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అయితే తదుపరి వచ్చే వేరియంట్‌ కూడా ఒమిక్రాన్‌ తరహాలో తక్కువ ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుందని భావించకూడదు. మునుపటి వైరస్‌ రకాల తరహాలో అది చెలరేగొచ్చు. అందువల్ల కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం ముఖ్యం. కొందరు అభివర్ణిస్తున్నట్లు ఒమిక్రాన్‌.. కొవిడ్‌కు సహజసిద్ధ టీకా కాదు. దాన్ని అలా పరిగణించడం ప్రమాదకరం. మన ఆరోగ్యంపై భిన్న వేరియంట్లు చూపే ప్రభావంపై మనకు పూర్తి అవగాహన లేదు" అని గుప్తా పేర్కొన్నారు.

ప్రస్తుతం ఒమిక్రాన్‌ వల్ల స్వల్ప స్థాయి ఇన్‌ఫెక్షన్‌ మాత్రమే కలుగుతున్నందువల్ల ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని టీకాల విస్తృతిని పెంచాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి:ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 27లక్షల కరోనా కేసులు.. అమెరికాలో ఆగని ఉద్ధృతి

ABOUT THE AUTHOR

...view details