కొవిడ్-19 నుంచి కోలుకున్నవారిలో మెదడులో గ్రే మ్యాటర్ తగ్గిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వారి స్కాన్లను పరిశీలించినప్పుడు ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కొవిడ్ కేవలం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కాదని, కొందరిలో ఇది మెదడుపైనా ప్రభావం చూపుతుందని ఇప్పటికే జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. పక్షవాతం, డిమెన్షియా వంటి సమస్యలకు ఇది దారితీయవచ్చని అధ్యయనాలు తేల్చాయి. తాజాగా గ్రే మ్యాటర్ కూడా తగ్గిపోతోందని వెల్లడైంది.
మెదడులో సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో గ్రే మ్యాటర్ కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా వ్యక్తులు తమ కదలికలు, జ్ఞాపకశక్తి, భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు. గ్రే మ్యాటర్‌లో లోపాల వల్ల నాడీ కణాలు, కమ్యూనికేషన్ వ్యవస్థల పనితీరుపై ప్రభావం పడుతుంది.