యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గాలి ద్వారానూ వ్యాపిస్తున్నట్లు ఇప్పటికే ప్రాథమిక అధ్యయనాలు వెల్లడించాయి. అయినా దీన్ని నిర్ధారించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి కచ్చితమైన ఆధారాలున్నాయని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది. తాజాగా ఈ నివేదిక ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ 'ది లాన్సెట్'లో ప్రచురితమైంది.
కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తి నియంత్రణలో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో కొవిడ్-19కు కారణమైన 'సార్స్-కోవ్-2' వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందన్న నివేదికలు ఆందోళనకు గురిచేశాయి. వీటిని నిర్ధారించేందుకు బ్రిటన్, అమెరికా, కెనడాకు చెందిన ఆరుగురు నిపుణులు బృందం నడుం బిగించింది. చివరకు గాలి ద్వారానూ వైరస్ వ్యాప్తి చెందుతుందని తేల్చే పది విషయాలను నివేదించింది.
సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లు..
కరోనా వైరస్ వ్యాప్తికి ముఖ్యంగా సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లు కారణమవుతున్నాయని తాజా అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ సోకిన ఓ వ్యక్తి నుంచి 53 మందికి సోకిన ఓ ఘటనను నివేదికలో ఉదహరించారు. వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడం లేదా అతను తాకిన ప్రదేశాలు, వస్తువులను తాకకుండానే వారందరికీ వైరస్ సోకిన విషయాన్ని గుర్తుచేశారు. వారందరిపై జరిపిన అధ్యయనంలోనూ ఇదే విషయం తేలిందని నిపుణులు స్పష్టంచేశారు. గాలిద్వారా వైరస్ వ్యాప్తి చెందడమే ఇలాంటి ఘటనకు కారణమని అభిప్రాయపడ్డారు.
లక్షణాలు లేని వారినుంచీ..!
బాహ్యప్రదేశాల్లో కంటే ఇండోర్ ప్రదేశాల్లోనే వైరస్ వ్యాప్తి అత్యధికంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే, ఇండోర్ ప్రదేశాల్లో సరైన వెంటిలేషన్ ఉన్నట్లయితే వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు. అసింప్టమెటిక్(లక్షణాలు లేని) వ్యక్తుల నుంచి కరోనా వైరస్ నిశ్శబ్దంగా వ్యాప్తి చెందుతున్న విషయాన్ని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 40శాతం దగ్గు, తుమ్ము వంటి లక్షణాలు లేనివారి నుంచే ఇతరులకు సోకుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాపించడానికి ఈ నిశ్శబ్ద వ్యాప్తే ఎంతో కీలకంగా వ్యవహరించిందని.. గాలిలో వైరస్ వ్యాపిస్తుందనడానికి ఇది కూడా ప్రధాన కారణంగా కనిపించిందని నిపుణులు వెల్లడించారు. ఒకరినొకరు సన్నిహితంగా మెలగకున్నా.. హోటళ్లలో పక్క గదుల్లో ఉన్న వ్యక్తులకు వైరస్ సోకడాన్ని కూడా నిపుణులు ఉదహరించారు.