తెలంగాణ

telangana

ETV Bharat / international

8 వేలు దాటిన కరోనా మరణాలు.. 2లక్షలకు పైగా కేసులు

ఆసియాలో బీభత్సం సృష్టించిన కరోనా వైరస్.. ఐరోపాలో విజృంభిస్తోంది. ఆసియాతో పోలిస్తే ఇప్పుడు అక్కడే అధిక మరణాలు నమోదయ్యాయి. ఇటలీలో అత్యధిక మరణాలు సంభవించగా.. స్పెయిన్​లోనూ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 8 వేలు దాటింది. బాధితుల సంఖ్య 2 లక్షలను అధిగమించింది.

corona
కరోనా

By

Published : Mar 18, 2020, 7:32 PM IST

Updated : Mar 18, 2020, 7:58 PM IST

ప్రపంచాన్ని కొవిడ్-19 పట్టి పీడిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 8,092 మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 684 మంది మరణించినట్లు పేర్కొన్నారు. మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది.

ఐరోపా ఖండంలో కొవిడ్-19 విజృంభిస్తోంది. ఆసియాలో నమోదైన మరణాలతో పోలిస్తే ఐరోపాలోనే అధికంగా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఆసియాలో ఇప్పటివరకు 3,384 మంది మరణించగా... ఐరోపాలో 3,421 మంది మృతి చెందినట్లు సమాచారం. ఐరోపా దేశాల్లో అత్యధికంగా ఇటలీలో 2,503 మరణాలు సంభవించాయి.

ఈ నేపథ్యంలో ఐరోపా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. వేగంగా వ్యాపిస్తున్న వైరస్​ను నియంత్రించడానికి ఐరోపా సమాఖ్య తన సరిహద్దులను మూసేస్తున్నట్లు ప్రకటించింది. 30 రోజులపాటు బయటి ప్రయాణికులకు అనుమతి నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది.

స్పెయిన్​లోనూ వేగంగా..

స్పెయిన్​లోనూ కరోనా బీభత్సం సృష్టిస్తోంది. వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య 13 వేలు దాటింది. దేశంలో మృతుల సంఖ్య 598కి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

"స్పెయిన్​లో 13,716 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఇది 2,538(18 శాతం) అధికం. 24 గంటల సమయంలో మృతుల సంఖ్య 107 పెరిగి 598కి చేరింది."

-స్పెయిన్ అధికారులు

స్పెయిన్​లో మాడ్రిడ్​ నగరంలో అధికంగా కరోనా ప్రభావం ఉంది. మొత్తం కేసుల్లో దాదాపు 41 శాతం ఈ నగరంలోనే గుర్తించారు. మాడ్రిడ్​లో 5,637 కేసులు నమోదు కాగా... 390 మంది వైరస్​ కారణంగా తనువు చాలించారు.

ప్రతీ అనుమానిత కరోనా కేసును నిశితంగా పరీక్షించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. వైరస్​ను ఎదుర్కొనేందుకు ఐరోపా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది.

ఇతర దేశాల్లో

కరోనా నేపథ్యంలో విదేశీ ప్రయాణాలు చేయవద్దని తమ పౌరులకు ఆస్ట్రేలియా సూచించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 500 దాటినందున... పలు చర్యలకు ఉపక్రమించింది. వంద మందికి పైగా పాల్గొనే సమావేశాలను రద్దు చేసింది.

ఆఫ్రికాలో కొవిడ్ బాధితుల సంఖ్య 500కు చేరింది. బుర్కినా ఫాసోలో తొలి కరోనా మరణం సంభవించింది. లాటిన్ అమెరికాలో 1,100 మందికి వైరస్​ సంక్రమించింది. బ్రెజిల్​లో తొలి కరోనా మరణం సంభవించినట్లు అధికారులు ధ్రువీకరించారు. కరోనా కారణంగా బంగ్లాదేశ్​లో తొలి మరణం నమోదైంది. అక్కడ మొత్తం 14 మందికి వైరస్​ సోకింది.

రష్యాలోనూ కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పటికి అక్కడ 147 మందికి వైరస్​ సోకింది. సింగపూర్​లో 47 కొత్త కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 313కు చేరింది.

కరోనా వ్యాప్తి అరికట్టడానికి శ్రీలంకలోని పశ్చిమ తీరంలోని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. వైరస్ ప్రాబల్యం అధికంగా పలు ప్రాంతాలను గుర్తించారు. నిర్బంధం నుంచి తప్పించుకున్న 15 వందల మంది ఈ ప్రాంతాలకు చెందిన వారేనని అనుమానిస్తున్నారు. దేశంలో కరోనా కేసులు 50 దాటినట్లు అధికారులు స్పష్టం చేశారు.

నూతన కేసుల నమోదుతో పాకిస్థాన్​లో కరోనా బాధితుల సంఖ్య 250కి చేరింది. సింధ్ రాష్ట్రంలో అధికంగా 181 కేసులు నమోదయ్యాయి. పంజాబ్​లో 26, ఖైబర్​లో 19, ఇస్లామాబాద్​లో 8, గిల్గిట్-బాల్టిస్థాన్​లో మూడు కేసులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

శాంతించిన చైనా!

చైనాలో మాత్రం కరోనా దాదాపు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా రెండో రోజూ ఒక్క కేసు మాత్రమే నమోదైనట్లు ప్రకటించింది. దక్షిణ కొరియాలో సైతం వైరస్ తగ్గుముఖం పట్టినట్లు సమాచారం.

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు...

ఈ వైరస్​ను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఆర్థికంగా వెనుకాడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా మందగమన పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో అమెరికా, బ్రిటన్​ పలు చర్యలు చేపడుతున్నాయి.

విమానాయాన సంస్థలు సహా అన్ని రంగాలపై పెను ప్రభావం పడుతున్న నేపథ్యంలో 850 బిలియన్ డాలర్ల బడ్జెట్ ఆమోదానికి అమెరికన్ కాంగ్రెస్​లో వ్యయ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. కరోనా కారణంగా నష్టపోతున్న వ్యాపారాలను ఆదుకునేందుకు 330 బిలియన్ పౌండ్ల రుణాలను మంజూరు చేయనున్నట్లు బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ వెల్లడించారు. ఇదే తరహాలో ఫ్రాన్స్, జర్మనీ సైతం పలు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

Last Updated : Mar 18, 2020, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details