కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దక్షిణాసియా దేశాలకు ఆర్థిక సాయం చేసేందుకు పూనుకున్నారు బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్. ఈ మేరకు బ్రిటీష్ ఆసియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యవసర నిధిని ఏర్పాటు చేశారు.
ఆర్థిక సాయం..
మహమ్మారిని నిలువరించేందుకు బ్రిటన్-ఆసియా దేశాలు పరస్పరం సహకరించుకోవడాన్ని ప్రశంసించారు యువరాజు. ఈ అత్యవసర నిధికి తమ వంతు విరాళాలు అందజేయాలని ప్రవాసులను కోరారు. ఫలితంగా తమ సొంత దేశాల్లో వైరస్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కొంత మేర సహాయం చేయగలరన్నారు.
"కరోనా సంక్షోభం నుంచి బ్రిటన్ కోలుకోవడానికి బ్రిటీష్ ఆసియా కమ్యూనిటీ కీలకంగా పనిచేస్తోందని నాకు తెలుసు. ఆరోగ్య సేవలు, స్వచ్ఛంద కార్యక్రమాల్లో మీరంతా భాగస్వాములవుతున్నారు. విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నవారికి, పేదవారికి, బలహీన వర్గాలకు ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ఈ ట్రస్ట్ ద్వారా నా మద్దతు ఇస్తున్నాను".