ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై విస్తృతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైరస్ జన్యు పదార్థం శ్వాసకోశ, మలం నమూనాల్లో వారాలపాటు ఉండిపోతుందని గతంలో కనుగొన్న శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో కొత్త విషయాలను చెప్పుకొచ్చారు. కరోనా లక్షణాలు ప్రారంభమైన తొమ్మిది రోజుల తర్వాత శ్వాసకోశ, మలం నమూనాల్లో ఎటువంటి వైరస్ కణాలను గుర్తించలేదని వివరించారు.
బ్రిటన్‌కు చెందిన సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయం ఈ పరిశోధన చేసింది. దీనికి సంబంధించిన అంశాలను 'ద లాన్సెట్ మైక్రోబ్ జర్నల్'లో ప్రచురించారు.
కరోనా సోకిన తొలి ఐదు రోజుల్లోనే వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని పరిశోధనలో తేల్చింది. ఈ సమయంలోనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎక్కువగా సోకుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.