కరోనా ప్రభావం శస్త్రచికిత్సలపై పడింది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల సర్జరీలు నిలిచిపోయే అవకాశం ఉందని ఓ అధ్యయనం తెలిపింది. ఫలితంగా వైద్యం కోసం రోగులు సుదీర్ఘ సమయం ఎదురు చూడాల్సి పరిస్థితి ఏర్పడిందన్నారు.
శస్త్రచికిత్సలపై కరోనా ప్రభావాన్ని విశ్లేషించేందుకు.. 120 దేశాల భాగస్వమ్యంతో 'కొవిడ్సర్జ్' అనే సహకార విభాగం ఏర్పాటైంది. 'బర్మింగ్హమ్ విశ్వవిద్యాలయానికి' చెందిన పరిశోధకులు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. 71 దేశాల్లోని 359 ఆసుపత్రుల నుంచి శస్త్రచికిత్సల రద్దుపై సమగ్ర సమాచారాన్ని సేకరించారు. మహమ్మారి పరిస్థితుల కారణంగా ఆసుపత్రి సేవలకు 12 వారాలు అంతరాయం ఏర్పడగా.. ఈ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
వారంలో 24 లక్షలు రద్దు...
ఆసుపత్రులకు అంతరాయం కలుగుతున్న ప్రతి అదనపు వారానికి.. మరో 24 లక్షల సర్జరీలు రద్దయ్యే అవకాశం ఉందని 'బ్రిటన్ జర్నల్ ఆఫ్ సర్జరీ'లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఖరారైన 72.3 శాతం శస్త్రచికిత్సలు రద్దవుతాయని పరిశోధకులు అంచనా వేశారు.