కరోనా మహమ్మారి కారణంగా అనేక ఇతర దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. తాజాగా కొవిడ్‌తో వినికిడి కోల్పోయే ప్రమాదం ఉందని బ్రిటన్‌కు చెందిన లండన్ యూనివర్సిటీ కాలేజ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. వీరు వినికిడిపై కరోనా వైరస్ కలిగించే ప్రభావంపై అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా వీరు బ్రిటన్‌లోని రాయల్ నేషనల్ చెవి, ముక్కు ఆసుపత్రిలో కొవిడ్-19 చికిత్స కోసం చేరిన 45 ఏళ్ల వ్యక్తి కేసును ఉదహరించారు.
శ్వాస తీసుకోవడంలో బాధిత వ్యక్తి ఇబ్బంది పడ్డారు. దీంతో వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. వెంటిలేటర్‌పై 30 రోజులు ఉంచారు. తర్వాత ఆ వ్యక్తి కోలుకున్నారు. అయితే అతని ఎడమచెవి వినికిడి శక్తిని కోల్పోయింది. చెవిని పరీక్షించారు. ఎక్కడా అవరోధాలు లేవు. ఎందుకు జరిగిందో వైద్యులకు అర్థం కాలేదు. తర్వాత స్థెరాయిడ్ మాత్రలు, ఇంజెక్షన్లు ఇచ్చారు. పాక్షికంగా మళ్లీ వినికిడి శక్తి వచ్చింది. అతనికి ఫ్లూ, హెచ్ఐవీ టెస్టులు చేశారు, నెగెటివ్ ఫలితాలే వచ్చాయి. దీంతో కొవిడ్-19 కారణంగానే వినికిడి శక్తి పోయిందన్న నిర్ధరణకు వైద్యులు వచ్చారు.