ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తీవ్రతపై కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). మానవాళికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన ఈ వైరస్.. 2009లో ప్రపంచాన్ని ఇబ్బందిపెట్టిన స్వైన్ఫ్లూ కంటే పది రెట్లు తీవ్రమైనదని తెలిపింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లాక్డౌన్ ఆంక్షలను నెమ్మదిగా ఎత్తేయాలని అభిప్రాయపడింది.
" కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని మనకు తెలుసు. 2009లో వచ్చిన స్వైన్ఫ్లూ కంటే ఈ వైరస్ పది రెట్లు ప్రమాదకరం"
-టెడ్రోస్ అధానోం, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు
న్యూయార్క్లో పదివేలమంది మృతి..
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఇప్పటివరకు 10,000 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు గవర్నర్ ఆండ్రూ క్యూమో ప్రకటన విడుదల చేశారు. అమెరికాలో గత 24 గంటల వ్యవధిలో 772 మంది మృతిచెందారు. ఇందులో న్యూయార్క్ రాష్ట్రంలోనే 671 మంది అసువులు బాశారు. ఇప్పటివరకు మొత్తం 22,877 మంది చనిపోయారు. కొత్తగా 6,354 మందికి వైరస్ సోకగా.. బాధితుల సంఖ్య 5లక్షల 66వేల 654కు పెరిగింది.
బ్రిటన్లో పదకొండు వేలమంది..
కరోనాతో బ్రిటన్లో తాజాగా 717 మంది మరణించారు. దేశంలో మొత్తంగా 11,329 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే కొన్ని రోజులుగా బ్రిటన్లో కొవిడ్-19 మరణాలు తగ్గుముఖం పట్టాయి.
ఇదీ చూడండి:లాక్డౌన్ ఎత్తివేత ఒత్తిడిలో ప్రపంచ దేశాలు