కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో, మరణాల రేటును తగ్గించడంలో, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే వ్యూహాల్లో నాలుగు దేశాలు అనుసరిస్తున్న విధానాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తగిన ముందుజాగ్రత్త చర్యలు, అనుమానితులకు గణనీయ సంఖ్యలో పరీక్షల నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, భౌతిక దూరం పాటింపుపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ విభాగాల మధ్య పక్కా సమన్వయంతో.. జర్మనీ, తైవాన్, న్యూజిలాండ్, గ్రీసులు ఇప్పుడు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వైరస్‌ను నిలువరించడానికి ఆయా దేశాలు అనుసరిస్తున్న వ్యూహాలేమిటో చూద్దాం..
జర్మనీ
‘పరీక్ష’ను పరీక్షలతోనే ఎదుర్కొంటూ..
కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో, ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో జర్మనీ అనుసరిస్తున్న విధానం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వ ముందుజాగ్రత్త చర్యల కారణంగా ఇక్కడ దాదాపు 64,300 మంది కోలుకున్నారు. మరే దేశంలోనూ ఈ స్థాయిలో రోగులు కోలుకోలేదు. జనవరి 27న బవేరియలో తొలికేసు నమోదైంది. స్టాక్‌డోర్ఫ్‌గా పిలిచే ప్రాంతాన్ని క్లస్టర్‌గా గుర్తించిన ప్రభుత్వం ఇక్కడ పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత ఆస్ట్రియా, ఇటలీ నుంచి వచ్చిన వారిని వెంటనే గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచడంతో ఒక్కసారిగా సామాజిక వ్యాప్తి జరగలేదు. ప్రజలకు భౌతిక దూరంపై జర్మనీ అవగాహన కల్పించింది. మార్చి 6 నుంచి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో 22న దేశ స్థాయిలో లాక్‌డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 4 నాటికి దేశంలోని 132 పరీక్షా కేంద్రాలను ఉపయోగించుకొని రోజుకు సగటున 1,16,655 స్వాబ్ టెస్ట్‌లను నిర్వహించింది. ‘
ఇన్ఫెక్షన్ ప్రొటెక్షన్ చట్టం’లో మార్పులు చేసి ఫోన్ల ఆధారంగా బాధితులపై నిఘాపెట్టింది. బాధితులకు సలహాలు ఇచ్చేందుకు టెలిమెడిసిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్థానిక స్టార్టప్ ‘డాక్‌యట్’ ఆన్‌లైన్ చాట్‌బోట్‌ను రంగంలోకి దించింది. ఇది అనుమానితుల ఆరోగ్య పరిస్థితిని అంచనావేసి టెలిమెడిసిన్ వాడుకోవడంలో సలహాలు ఇస్తోంది. జర్మనీ ఆరోగ్య వ్యవస్థపై జీడీపీలో 11.1 శాతం వెచ్చిస్తోంది. ఇక్కడ ప్రతి వ్యక్తిపై 4,271 డాలర్లను ఖర్చుచేస్తోంది. ఏప్రిల్ నాటికి వెంటిలేటర్లు సహా ఇంటెన్సివ్ కేర్ పడకల సంఖ్యను 40 వేలకు పెంచింది. దేశ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ స్వయంగా శాస్త్రవేత్త కావడంతో పరిస్థితుల్ని వేగంగా అర్థంచేసుకొని భౌతిక దూరం నిబంధనలను కఠినంగా అమలు చేశారు. ఫలితంగా వ్యాధి వ్యాప్తి మందగించి.. రోగులకు మెరుగైన వైద్యం అంది, మరణాల రేటు తగ్గిపోయింది.
తైవాన్
వైరస్ కంటే వేగంగా కదిలి..
ముందు జాగ్రత్త.. పటిష్ఠ వైద్య వ్యవస్థతోపాటు, ప్రజలు చైతన్యంగా ఉంటే... ఎలాంటి ఆరోగ్య విపత్తులు వచ్చినా గట్టిగా ఎదుర్కోవచ్చని తైవాన్ నిరూపించింది. చైనాకు 130 కి.మీ దూరంలోని ఈ చిరు ద్వీపం కరోనావైరస్‌పై అందరి కంటే మందే ప్రపంచ ఆరోగ్య సంస్థను అప్రమత్తం చేసింది. ఆ వెంటనే డిసెంబరు 31 నుంచే చైనా నుంచి వస్తున్న వారిని పరీక్షించడం ప్రారంభించింది. కరోనా పుట్టుకకు కేంద్రస్థానమైన వుహాన్ నుంచి వచ్చే వారిపై జనవరి 23న ఆంక్షలు పెట్టింది. చైనా పర్యటకుల రాకపై ఫిబ్రవరి 6న నిషేధం విధించింది. తైవాన్ వాసులు చైనాకు వెళ్లకూడదని ప్రకటించింది. ఫేస్‌మాస్క్‌ల రోజువారీ ఉత్పత్తిని 10 మిలియన్లకు చేర్చాలని స్థానిక కంపెనీలను ఆదేశించింది. ఫేస్‌మాస్క్‌ల పంపిణీని ప్రైవేటు రంగం నుంచి ప్రభుత్వం చేతిలోకి తీసుకొంది. ప్రతిఒక్కరూ వారానికి కొనాల్సిన వాటిపై రేషన్ విధించింది. ఆ తర్వాత దాదాపు కోటి మాస్కులను అమెరికా, ఐరోపాలకు అందజేసింది.
దేశంలో కరోనా కేసుల సమన్వయానికి తైవాన్ సెంట్రల్ ఎపిడమిక్ కమాండ్ సెంటర్ ఉపయోగపడింది. తైవాన్ ప్రభుత్వం, అక్కడి ఆసుపత్రుల మధ్య విస్తృత సమన్వయం ఉండటం కలిసొచ్చింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ చిప్‌తో కూడిన ఆరోగ్యకార్డును జారీ చేశారు. వారి ఆరోగ్య చరిత్ర అంతా అందులో నిక్షిప్తంచేశారు. బాధితులను గుర్తించి వారిని స్వీయ నిర్బంధంలో ఉంచారు. ఆసుపత్రులను అన్ని రకాలుగా సిద్ధంచేసి, మందులు, సామగ్రిని వేగంగా సమకూర్చారు. వైరస్ ముప్పు ఉండటంతో ఆసుపత్రుల్లో సిబ్బంది ఎంతవరకు అవసరమో అంతే ఉంచారు. ఒకవేళ వైరస్ అకస్మాత్తుగా విజృంభించినా ఎదుర్కొనేలా 1000 ఐసోలేషన్ గదులను సిద్ధంచేశారు. ప్రజలు కూడా తమ పిల్లలను పాఠశాలకు పంపేముందు నిత్యం శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తున్నారు. తరగతి గదుల్లోనూ విద్యార్థులను దూరంగా కూర్చోబెడుతున్నారు. ఇవన్నీ ఈ చిరుద్వీపానికి సంక్షోభ సమయంలో కలిసొచ్చాయి.