సామాజిక దూరం, స్వీయ నిర్బంధంతో కరోనా వైరస్ వ్యాప్తిని కొంత సమయం అడ్డుకోవచ్చు. వ్యాక్సిన్‌తోనే ఈ మహమ్మారిని పూర్తి స్థాయిలో నియంత్రించగలం. కానీ... వ్యాక్సిన్ తయారు చేయటం ఒక ఎత్తయితే.. దాన్ని ప్రజలందరికీ అందేలా చూడటం మరో కీలకాంశం.
మరో ఏడాది!
కొవిడ్- 19కు వ్యాక్సిన్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని.. ఒకవేళ వేగంగా పరీక్షలు చేపడితే ఈ సంవత్సరమే ప్రజలకు చేరుతుందని అంచనా వేశారు బ్రిటన్‌లోని బర్మింగ్హమ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పవనెక్ కోహ్లీ. అప్పటివరకు సామాజిక దూరంతోనే కరోనాను ఎదుర్కోగలమని స్పష్టం చేశారు.
"దేశాలన్నీ వ్యాక్సిన్ కోసం తమను తాము సిద్ధం చేసుకోవాలి. ప్రజలకు చేరవేసేందుకు విస్తృతమైన యంత్రాంగాన్ని ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు చేసుకోవాలి. "
- పవనెక్ కోహ్లీ, ప్రొఫెసర్
ప్రస్తుత వ్యాక్సినేషన్ వ్యవస్థతో చాలా వైరస్ సంబంధిత టీకాలు అవసరమైన వారికి చేరటం లేదని కోహ్లీ తెలిపారు. ఇప్పుడు కరోనా వైరస్ టీకాలు అందరికీ అందాలంటే ప్రస్తుతమున్న వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
"ప్రస్తుతం వైద్య పరికరాలు, పడకల విషయంలో ఆందోళన నెలకొంది. కానీ ప్రతి మారుమూల గ్రామంలోనూ వ్యాక్సిన్ లభించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొవిడ్- 19 వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయటంలో ప్రస్తుతం ఉన్న డెలివరీ వ్యవస్థతో మున్ముందు ఇబ్బందులు తప్పవనేది నిజం."
- పవనెక్ కోహ్లీ, ప్రొఫెసర్
ఈ సమస్యను అధిగమించాలంటే వివిధ దేశాల ఉష్ణోగ్రతలను అనుసరించి టీకాలను నిల్వ చేసే విధానాల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని వివరించారు కోహ్లీ.
"ఆహారం, ఔషధాలను నిల్వ చేసేందుకు సమర్థమైన శీతలీకరణ వ్యవస్థ అవసరం. అప్పుడే పారిశ్రామిక, ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. పట్టణీకరణ, వ్యవసాయం స్థిరంగా ఉంటుంది. వ్యాక్సిన్ విషయంలోనూ ఇంతే. ఉదాహరణకు.. ఇన్ ఫ్లూయెంజా వ్యాక్సిన్ 2- 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలి.
ప్రస్తుతం వివిధ దేశాల్లో ఇప్పుడున్న వ్యవస్థతో పలు వ్యాధుల వ్యాక్సిన్లు సరఫరా చేసే అవకాశం ఉండవచ్చు. కానీ కొవిడ్- 19 వ్యాక్సిన్ కు ఇది సరిపోదని నా అభిప్రాయం.
ప్రతి మందుల దుకాణంలో టీకాలను అందుబాటులోకి తేవాలి. నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. షాపింగ్ మాల్స్, విశ్వవిద్యాలయాలు, కార్యాలయాలు, థియేటర్లలో వ్యాక్సిన్ అందించే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. భారత్ సార్వత్రిక ఎన్నికలను మించిన యంత్రాంగం అవసరం. ఇలా ఎక్కువ మార్గాల్లో పంపిణీ చేయటం వల్ల ఆసుపత్రులపై భారం తగ్గుతుంది. ఫలితంగా వ్యాక్సిన్ అందరికీ చేరే అవకాశం ఉంటుంది." - పవనెక్ కోహ్లీ, ప్రొఫెసర్
వ్యాక్సిన్ పంపిణీ పూర్తిగా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లడం సరికాదని అభిప్రాయపడ్డారు కోహ్లీ. ప్రభుత్వ నియంత్రణలోనే సరఫరా జరగాలన్నారు. ప్రతి వ్యాక్సిన్‌కు సంబంధించి వివరాలను నమోదు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
వ్యాక్సిన్ సరఫరాకు అవసరమైన పరికరాలు, మౌలిక సదుపాయాలు ముందే ఏర్పాటు చేసుకుని కార్యాచరణకు సిద్ధంగా ఉండాలన్నారు కోహ్లీ. సుదీర్ఘ కాలంలో శాశ్వత వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ కార్యాచరణ రూపొందించాలని సిఫార్సు చేశారు. నిర్ధిష్టమైన ప్రణాళిక రూపొందించుకునేందుకు కావాల్సిన సమయం ఉందని.. అందువల్ల స్థిరమైన పరిష్కారాలను వెతకాలని సూచించారు.
ఇదీ చూడండి:మాస్కు ఎవరు వాడాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?