కరోనా కొత్త రకం స్ట్రెయిన్ బ్రిటన్‌లో ఉప్పెనలా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. జర్మనీ, ఇటలీ, బెల్జియం, డెన్మార్క్, బల్గేరియా, టర్కీ, కెనడా వంటి దేశాలు ఇప్పటికే సరిహద్దులు మూసివేసి అప్రమత్తమయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో ఐరోపా దేశం ఫ్రాన్స్ చేరింది. పలు దేశాలు ముందు జాగ్రత్త చర్యగా బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి.
- కరోనా కొత్త స్ట్రెయిన్ కారణంగా బ్రిటన్వ్యాప్తంగా కఠిన లాక్డౌన్ అమలు చేస్తోంది ప్రభుత్వం. అత్యవసరం మినహా అన్ని రకాల ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండేలా నిబంధనలు అమలు చేస్తోంది.
- హాంగ్‌కాంగ్, ఇజ్రాయెల్, ఇరాన్, క్రొయేషియా, అర్జెంటీనా, చిలీ, మొరాకో, కువైట్ వంటి దేశాలు బ్రిటన్‌పై ప్రయాణ ఆంక్షలు విధించాయి.
- భారత్ కూడా బ్రిటన్ విమాన రాకపోకలపై డిసెంబర్ 31 వరకు నిషేధం విధించింది.
- ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర కమిటీతో సోమవారం సమావేశం కానున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించనున్నారు.
- బ్రిటన్‌లో ఒక్కరోజే 35వేలకు పైగా కొత్త రకం కరోనా కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఐరోపా సమాఖ్య సభ్య దేశాలు కూడా మరింత అప్రమత్తమయ్యాయి. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి వైరస్‌ను కట్టడి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నాయి.
- దేశంలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉందని బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మ్యాట్ హ్యాంకాక్ ఆందోళన వ్యక్తం చేశారు. టైర్-4 లాక్డౌన్ అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం శత విధాలా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌ను కట్టడి చేయడం అత్యంత క్లిష్టతరమని చెప్పారు.
- కొత్త రకం కరోనా ఎంత ప్రమాదకరమో ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని , అయితే అది అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతుందని మాత్రం గుర్తించినట్లు లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన నిపుణులు డా.ఎరిక్ వాయిజ్ తెలిపారు.
- ఉత్తర్ ఐర్లాండ్ మినహా బ్రిటన్ మొత్తం కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతోంది.
- ప్రభుత్వం ఆంక్షల కారణంగా ఇంగ్లాండ్, వేల్స్‌లోని 2.1కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర సేవలు మినహా అన్నింటిపై ఆంక్షలు విధించారు. టైర్-4 ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు.. క్రిస్మస్ వేళ కూడా తమ ఇళ్లలో మరొకరికి ఆతిథ్యం ఇవ్వడానికి వీల్లేదు.
- బోరిస్ జాన్సన్ అసమర్థత కారణంగానే ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి నెలకొందని ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ విమర్శించారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.