తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా కాలంలో సైకిల్​తో సావాసమే నయం!

బస్సు, మెట్రోలో వెళ్దామంటే... కరోనా భయం. అందరూ సొంత వాహనాలే వాడడం మొదలుపెడితే కాలుష్య భూతం కాటేయడం ఖాయం. మరి ఈ సమస్యకు పరిష్కారమెలా? ఇదే అంశంపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటికే కొన్ని దేశాలు కొన్ని ప్రత్యామ్నాయాల్నీ గుర్తించాయి. వాటిలో మొదటిది... సైకిల్. విద్యా సంస్థలకు, కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు సైక్లింగ్​ను ఎంచుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇంతకీ ఏ దేశం ఏం చేస్తోంది? ఎంత ఖర్చు పెడుతోంది? భారత్​ పరిస్థితి ఏంటి? వంటి విశేషాలతో ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం మీకోసం...

Could coronavirus hold the key to making cycling mainstream?
కరోనా రేపిన చిచ్చు.. రవాణాకు ఇక సైకిలే దిక్కు!

By

Published : Jun 3, 2020, 10:45 AM IST

Updated : Jun 3, 2020, 12:57 PM IST

"వ్యక్తిగత వాహనాలు వద్దు- ప్రజా రవాణా ముద్దు"... కొన్ని నెలల క్రితం వరకు ప్రపంచవ్యాప్తంగా వినిపించిన నినాదమిది. కర్భన ఉద్గారాలు, కాలుష్యాన్ని తగ్గించి... భూగ్రహాన్ని కాపాడుకునేందుకు బస్సులు, మెట్రోల్లోనే ప్రయాణించాలని ప్రజల్ని ప్రోత్సహించాయి అన్ని దేశాల ప్రభుత్వాలు. కానీ... ఇప్పుడు కథ మారింది. అందుకు కారణం... కరోనా.

అలా ఇప్పుడు కష్టమే..

ఉదయం ఆఫీస్​కు వెళ్లేటప్పుడు, సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు బస్సులు, మెట్రో రైళ్లు ఎంత కిక్కిరిసి ఉంటాయో మనకు తెలియనిది కాదు. సీటు కాదు కదా... నిల్చునే స్థలం దొరకడమే గొప్ప విషయం. కానీ... ఇప్పుడు అలా ప్రయాణించగలమా? లేనే లేదు. కరోనా కాలంలో అలా ఇరుకైన బస్సులో, మెట్రోలో వెళ్తే అంతే సంగతులు. అలా అని అందరూ వ్యక్తిగత వాహనాల్లో వెళ్దామా అంటే... మొదటికే మోసం వస్తుంది. కరోనా నుంచి తప్పించుకున్నా కాలుష్య భూతం కాటేస్తుంది.

ఇదీ చూడండి:కరోనా చేసిన మేలు అదొక్కటే... కానీ...

మరి ఈ సంక్లిష్ట పరిస్థితిని అధిగమించడం ఎలా? ఈ ప్రశ్నకు ఇప్పటికే అనేక దేశాల్లో గట్టిగా వినిపిస్తున్న సమాధానం.... సైకిల్​. కరోనా రహిత, కాలుష్య రహిత, పర్యావరణ హిత ప్రయాణం సైకిల్​తోనే సాధ్యం మరి. అందుకే సైక్లింగ్​ను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాయి వేర్వేరు దేశాల ప్రభుత్వాలు. బ్రిటన్​ వంటి దేశాలు ఇప్పటికే కరోనా ప్యాకేజీలో భాగంగా కోట్లాది రూపాయలు ఇందుకోసం కేటాయించాయి.

సైకిల్​తోనే రోడ్లపై చక్కర్లు

ఏ దేశంలో ఎలా?

ఐరోపా దేశాల్లో మూడో వంతు ప్రజలు సైకిల్​నే ప్రధాన వాహనంగా వినియోగిస్తున్నారు. 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నచిన్న పట్టణాలకు వెళ్లాలంటే కార్లు, బస్సులకు బదులు వీటికే ఓటేస్తున్నారు.

డెన్మార్క్​లో..

అత్యుత్తమ జీవన శైలి కలిగిన నగరంగా పేరుగాంచిన డెన్మార్క్ రాజధాని కోపెన్​హెగన్​కు సైక్లింగ్​లో ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం ఉంది. పర్యావరణ అనుకూల నగరాల్లో ఒకటైన కోపెన్​హెగన్​లో... 2010 నుంచే 36 శాతం పౌరులు సైకిల్ ఉపయోగిస్తున్నారు. అక్కడి యంత్రాంగం చొరవతో.. 2017 నాటికి వాడకం 60శాతానికి పెరిగింది.

కరోనా కాలంలో సైకిల్​తో సావాసమే నయం!

నెదర్లాండ్స్​లో...

నెదర్లాండ్స్​లో సైక్లింగ్​ అనేది సాధారణ జనజీవనంలో ఓ భాగం. అక్కడ రవాణాకు దాదాపు 36 శాతం మంది సైకిల్​నే ఎంచుకుంటారు. ప్రజా రవాణా(11 శాతం) వినియోగించడం చాలా తక్కువ. దేశంలో సైక్లింగ్​ మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తారు. సైక్లింగ్​కు అనువైన విధంగా మార్గాలు, పార్కింగ్​, కూడళ్లు, ట్రాక్​ల నిర్మాణాల్లో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తారు. డచ్ ప్రధాని తరచూ సైకిల్​పైనే చక్కర్లు కొట్టడాన్ని చూస్తే అక్కడి పరిస్థితి అర్థమవుతుంది.

అదే దారిలో బ్రిటన్​...

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో చాలా దేశాలు దూరదృష్టితో ఆలోచిస్తున్నాయి. మున్ముందు ముప్పులను పసిగట్టి.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. బ్రిటన్​ కూడా.. రవాణా రంగంలో కీలక మార్పులను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. 'వన్స్​ ఇన్​ ఏ జనరేషన్​' పేరుతో.. సైక్లింగ్, నడక మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా 2 బిలియన్​ పౌండ్ల నిధుల్ని ప్రకటించింది.

సైకిల్​ బహుళ ప్రయోజనకారి

భౌతిక దూరాన్ని పాటించేందుకు ప్రజా రవాణా చేటు అని గ్రహించి.. సైక్లింగ్​, నడకకు ప్రాధాన్యం ఇస్తోంది యూకే సర్కార్​. ఇది ఇంకా వ్యాపార వృద్ధి, ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు యూకే రవాణా కార్యదర్శి గ్రాంట్​ షేప్స్​. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత మిలియన్ల కొద్ది సైకిళ్లు రోడ్లపైకి వచ్చే అవకాశముందని.. అందుకు అనుగుణంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా రహదారుల నిర్మాణం, అభివృద్ధి జరగాలని ఆదేశించారు.

అమెరికాలో పెరిగిన డిమాండ్​..

కొవిడ్​ విస్తృతి అధికంగా ఉన్న అమెరికాలోనూ సైకిళ్లకు డిమాండ్​ పెరిగిపోయింది. భౌతిక దూరం పాటించడం కోసం వీటి వెంటపడ్డారు అమెరికన్లు. సైకిల్​ స్టోర్లకు భారీగా తరలివెళ్తున్నారట.

భారత్​ కూడా ఆ దిశగా...

సైకిల్ వినియోగంలో ప్రస్తుతం భారత్... ఇతర దేశాల కంటే వెనుకంజలో ఉంది. ఆ దేశాల బాటలోనే మనమూ పయనిస్తే పర్యావరణానికి మేలు జరగడమే కాక దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మోటారు వాహనాల వినియోగం తగ్గుముఖం పడుతుంది. ఫలితంగా.. ఇంధన వనరులను పరిమిత స్థాయిలో వాడుకోవచ్చు.

పర్యావరణ హితం సైకిలే ఇక దిక్కు

ఇదీ చూడండి:దేశంలో పెరిగిన ఇంధన డిమాండ్

సాధారణంగా.. ఏ వాహనంలోనైనా 100% ఇంధనం ఖర్చవదు. అందులో రెండో వంతు గాలిలో కలిసిపోతుంది. పర్యావరణ కాలుష్యం పెరగటానికి... ఇదే ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల దేశ ఖజానాపై సుమారు 50 బిలియన్ డాలర్ల భారం పడుతోంది. సైకిల్ వినియోగంతో ఇంధన వనరుల దిగుమతి తగ్గించుకుని... ఆర్థిక భారం నుంచి విముక్తి పొందవచ్చు.

ఇదీ చూడండి:ఈటీవీ భారత్ గ్రౌండ్​​ రిపోర్ట్​: 'కాలాపానీ'పై రగడ ఏల?

Last Updated : Jun 3, 2020, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details