ప్రపంచదేశాలపై కొవిడ్-19 మహమ్మారి విశ్వరూపం చూపుతోంది. రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 47,183కి చేరింది. వైరస్ కేసుల సంఖ్యలోనూ గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది. ఇప్పటివరకు 9,34,825 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది.
స్పెయిన్‌లో 9 వేలు
కరోనా వైరస్ ధాటికి అతలాకుతలమవుతోన్న స్పెయిన్‌లో మరణాల సంఖ్య 9 వేలు దాటింది. వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య లక్షకు చేరింది. కొత్త కేసులు తగ్గుముఖం పట్టినట్లు అక్కడి అధికారులు స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి కారణంగా ఇటలీ తర్వాత అత్యధిక మరణాలు స్పెయిన్‌లోనే సంభవిస్తున్నాయి. గత 24 గంటల్లో 923 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 9,387కి చేరింది. వైరస్ నిర్ధరణ కేసులు 1,04,118కి చేరాయి.
గత రెండు రోజులుగా కొత్త కేసులు తగ్గుముఖం పట్టినట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఆస్పత్రులు, ఇంటెన్సివ్ కేర్లలో ఉన్న బాధితుల సంఖ్యలోనూ తగ్గుదల నమోదైనట్లు స్పష్టం చేశారు.
మార్చి 14న దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్.. ఇప్పుడు సానుకూల ఫలితాలు ఇస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడం వల్ల వైరస్ ప్రభావం తగ్గిందని అభిప్రాయపడ్డారు.
గణాంకాల ప్రకారం బుధవారం 8శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారం 11 శాతం కేసులు పెరిగాయి. అంతకుముందు వారంతో(20శాతం) పోలిస్తే ఇవి చాలా తక్కువ. మరోవైపు ఒక రోజులో సంభవించే మరణాల శాతం కూడా తగ్గుముఖం పడుతోంది. వారం క్రితం 27శాతం అధికంగా మరణాలు సంభవించగా.. తాజా గణాంకాల్లో 10.6శాతం మరణాలు సంభవించినట్లు స్పష్టమైంది. ఆస్పత్రుల్లో చేరే బాధితులు సైతం తగ్గుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
బ్రిటన్
కరోనా వైరస్‌కు బ్రిటన్‌లో ఒక్కరోజులోనే 563 మంది బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,352కి చేరింది. కొత్తగా 4,324 మందికి వైరస్ సోకగా.. దేశంలో కరోనా కేసులు 29,474కు చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రిన్స్ చార్లెస్ ప్రజలకు వీడియో సందేశం పంపారు . జాతీయ ఆరోగ్య సేవల కృషిని కొనియాడారు. ఈ వైరస్ ఎప్పుడు అంతమవుతుందో తెలియనప్పటికీ.. తప్పక అంతమవుతుందని పేర్కొన్నారు. అప్పటివరకు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచి మంచి రోజుల కోసం ఎదురు చూడాలన్నారు.
ఫ్రాన్స్‌లో వైరస్ మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం ఏకంగా 509 మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4,032కి చేరింది. మొత్తం 24,639 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నిర్ధరణ కేసుల సంఖ్య 4,861 పెరిగి 56,989కి చేరుకున్నాయి.
సాధారణం కన్నా వైరస్ మరణాలే ఎక్కువ!
ఇటలీలో సాధారణంగా సంభవించే మరణాల కంటే వైరస్ విధ్వంసంతోనే ఎక్కువగా మరణిస్తున్నారు. ఐరాస గణాంకాల ప్రకారం జనవరి మాసంలో ఇటలీలో అధిక మరణాలు సంభవిస్తుండగా.. జూన్‌లో తక్కువ సాధారణ మరణాలు నమోదవుతున్నాయి. దీని ప్రకారం ఇటలీలో అధిక ప్రభావితమైన లాంబార్డీ నగరంలో మార్చి నెలలో 7,176 మంది మరణించారు. ఇది సాధారణ మరణాలతో పోలిస్తే 15 శాతం తక్కువ. అయితే ఆస్పత్రి వెలుపల సంభవిస్తున్న వైరస్ మరణాలు, కరోనా పరీక్షలు జరగకముందే సంభవిస్తున్న మరణాలు లెక్కలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటలీ తప్పుడు లెక్కలు!
మరోవైపు ఇటలీలో నమోదవుతున్న వైరస్ గణాంకాలపై బెర్గమో మేయర్ జిరోజియో గోరీ అనుమానం వ్యక్తం చేశారు. వైరస్ గణాంకాలు అధికారిక లెక్కలతో పోలిస్తే అధికంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం బెర్గమో ప్రావిన్స్‌లో 2,060 మంది మరణించారని.. అయితే అసలు లెక్కలు మాత్రం 4,500 నుంచి 5,000 మద్య ఉండొచ్చని పేర్కొన్నారు. బెర్గామో ప్రావిన్స్‌లోనే 2.88 లక్షల మందికి వైరస్ సోకిందన్న స్థానిక గణాంక సంస్థ విశ్లేషణను ప్రస్తావించారు.