కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో అత్యంత కీలకంగా మారనున్నట్లు భావిస్తున్న 'హ్యామన్ ఛాలెంజ్' ట్రయల్స్‌ను ప్రారంభించనుంది బ్రిటన్ ప్రభుత్వం. ఈ ప్రయోగం కోసం 33.6 మిలియన్ పౌండ్లను కేటాయించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో ఈ ట్రయల్స్ జరగనున్నాయి. దీనికోసం 18నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 90 మంది వలంటీర్లను నియమిస్తున్నారు.
ప్రయోగంలో భాగంగా ఆరోగ్యవంతులైన వలంటీర్లకు ఉద్దేశపూర్వకంగా కరోనా వైరస్ సోకేలా చేస్తారు. క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసున్న వ్యాక్సిన్‌ను వారికి ముందుగానే ఇస్తారు. దీని ద్వారా వైరస్ ప్రభావం, వ్యాక్సిన్ సమర్థతపై కచ్చితమైన సమాచారం తెలుసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కరోనాపై ఈ తరహా ప్రయోగాలు చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి.
ఈ ప్రయోగం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది బ్రిటన్ ప్రభుత్వం. వలంటీర్లను సురక్షితమైన నియంత్రిత వాతావరణంలో ఉంచుతుంది. వైరస్ సోకేలా చేసిన తర్వాత వారిని 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఏమైనా దుష్ప్రభావాలు కన్పిస్తే వెంటనే అవసరమైన చికిత్స అందిస్తారు.