తెలంగాణ

telangana

By

Published : Dec 27, 2020, 11:13 AM IST

ETV Bharat / international

కరోనా చివరి మహమ్మారి కాదు: డబ్ల్యూహెచ్ఓ

భవిష్యత్తులో కరోనా వైరస్ లాంటి మహమ్మారులను ఎదుర్కోవాల్సి రావొచ్చని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు. 'అంటువ్యాధుల సన్నద్ధత' అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన తన సందేశాన్ని విడుదల చేశారు. అంటువ్యాధుల విషయంలో దూరదృష్టి లోపిస్తే ప్రమాదాలు తప్పవని అన్నారు. భవిష్యత్తు మహమ్మారులను నివారించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు.

coronavirus-pandemic-will-not-be-the-last-says-who-chief
కరోనా చివరి మహమ్మారి కాదు: డబ్ల్యూహెచ్ఓ

కరోనా వైరస్సే చివరి మహమ్మారి కాదని.. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఉపద్రవాల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌ అధనామ్‌ తెలిపారు. వాతావరణ మార్పులు, పశుసంరక్షణను సరిగా నిర్వహించలేకపోతే మానవ ఆరోగ్య మెరుగు కోసం చేపడుతున్న చర్యలు వృథాయే అవుతాయని పేర్కొన్నారు. అలాగే ఇలాంటి వైద్యారోగ్య విపత్తులు తలెత్తినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వాలు చేతులు దులుపుకొంటున్నాయని ఆరోపించారు. దీన్ని ఆయన ప్రమాదకరమైన ధోరణిగా అభివర్ణించారు. ఆదివారం తొలిసారి జరగనున్న 'అంటువ్యాధుల సన్నద్ధత' అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన తన వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

'నిర్లక్ష్యం పరిపాటి'

కొవిడ్‌ మహమ్మారి నుంచి యావత్తు ప్రపంచం అనేక పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని టెడ్రోస్‌ అభిప్రాయపడ్డారు. ఇలా అంటువ్యాధుల తలెత్తినప్పుడు భయాందోళనకు గురికావడం.. నివారణకు డబ్బులు ఖర్చుపెట్టడం.. తర్వాత నిర్లక్ష్యం చేయడం పరిపాటిగా మారిందని వాపోయారు. తర్వాత రాబోయే మహమ్మారి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలిపారు. అంటువ్యాధుల విషయంలో దూరదృష్టి లోపిస్తే ప్రమాదాలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఉపద్రవాలు మానవులు, జంతువులు, ప్రకృతి మధ్య అంతర్లీనంగా పెనవేసుకున్న బంధాన్ని గుర్తుచేస్తాయని వివరించారు. ఈ బంధం దెబ్బతిన్న కొద్దీ ప్రమాదానికి మరింత చేరువవుతామని హెచ్చరించారు. భూగ్రహంపై నివసించడానికి ఉన్న అనుకూలతలకు ముప్పు వాటిల్లే కొద్దీ అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. వాతావరణ మార్పులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గత సంవత్సర కాలంలో కరోనా మహమ్మారితో యావత్తు ప్రపంచం తలకిందులైందని టెడ్రోస్‌ అభిప్రాయపడ్డారు. దీని ప్రభావం ఒక్క మానన ఆరోగ్యానికి పరిమితం కాలేదని.. సామాజిక, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు మహమ్మారులను నివారించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎనిమిదికోట్ల మందికిపైగా మహమ్మారి బారినపడ్డారు. వీరిలో 17.5లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్‌: 2021లో వీటిపై దృష్టిపెట్టాల్సిందే

ABOUT THE AUTHOR

...view details