ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్... ఇటలీని చిగురుటాకులా వణికిస్తోంది. చైనా తరువాత అత్యధిక మరణాలు ఈ దేశంలోనే సంభవిస్తున్నాయి. వైరస్ తీవ్రత ఇప్పుడు ఇటలీలో నాలుగోదశలో ఉంది. అన్ని దేశాలకన్నా ముందుగానే ప్రయాణ ఆంక్షలు విధించినా.. ఇటలీలో పరిస్థితి ఎందుకు క్షీణించింది? ఈ దేశం ఎక్కడ నిర్లక్ష్యం చేసింది?
మొదట్లో నిర్లక్ష్యం..
జనవరి 29న రెండు కేసులు వెలుగుచూసిన మరుసటి రోజే ఇటలీలో ఆరు నెలల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చైనా నుంచి విమానాల రాకను నిషేధించారు. కానీ 20 రోజుల్లోనే పరిస్థితి తలకిందులైంది. ఇంత వేగంగా వైరస్ ఎందుకు వ్యాపించిందనే దానిపై శాస్త్రవేత్తలు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. జనవరి నెల మధ్య నుంచే ఈ వైరస్ నెమ్మదిగా ఇటలీలో పాదం మోపడం మొదలైందని.. మొదట్లో మరణాలు సంభవించేంతటి తీవ్రంగా లేదని, స్వల్ప దగ్గు, జ్వరం లాంటివి ఉండేవని వారు అంచనా వేస్తున్నారు. వీటిని సాధారణ ఫ్లూ జ్వరాల్లాగానే పరిగణిస్తూ.. తీవ్రతను గుర్తించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల వైరస్ స్వేచ్ఛగా వ్యాపించిందని బెర్న్ యూనివర్సిటీకి చెందిన అంటువ్యాధుల నిపుణుడు క్రిస్టియన్ ఆల్తస్ చెబుతున్నారు.
జనవరి నెలలో ఇటలీ ఆసుపత్రుల్లో న్యుమోనియా కేసులు కుప్పలు తెప్పలుగా నమోదయ్యాయి. ఈ రోగులకు కరోనా పరీక్షలు చేయడంలో విఫలం కావడం మరో కారణమని ప్రముఖ ఆరోగ్య పరిశీలకులు నినో బాక్టబెల్లోట్ట చెప్పారు. జనవరి 29వ తేదీన రెండు కేసుల తర్వాత మూడో కేసు ఫిబ్రవరి 18న కొడొగ్నో పట్టణంలో వెలుగుచూసింది. రోగికి తీవ్ర జ్వరం ఉన్నా, వైద్య సిబ్బంది దానిని కరోనా వైరస్‌గా గుర్తించలేదు. ఇంటికి వెళ్లిపోవడానికి అనుమతించారు. అతను ఆసుపత్రిలో ఉన్నప్పుడు, బయటికి వచ్చాక... వైరస్ విపరీత వ్యాప్తికి కారణమయ్యాడు.
రెండు మరణాలతో మొదలై..