ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్యతో.. ప్రస్తుతం 29 లక్షలకు చేరింది. పలు దేశాల్లో వైరస్ ప్రభావం కొనసాగుతుండటం వల్ల ఈ సంఖ్య మరింత పెరగనున్నట్లు స్పష్టమవుతోంది.
కొవిడ్ ధాటికి అమెరికా, ఐరోపా దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రపంచంలోని మూడో వంతు కేసులు అమెరికా కేంద్రంగానే నమోదయ్యాయి. అమెరికాలో గత 24 గంటల వ్యవధిలో 2,710 మంది మృతి చెందారు. అగ్రరాజ్యంలో మొత్తం 9.56 లక్షల మందికి ఈ మహమ్మారి సోకగా... 1.16 లక్షల మంది కోలుకున్నారు. మొత్తం 54 వేల మంది ఈ వైరస్‌కు బలయ్యారు.
ఇటలీ 26 వేలు
కరోనాతో దుర్భర స్థితిలోకి జారుకున్న ఇటలీలో మరో 415 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో 2,357 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఐరోపా దేశాల్లో అత్యధికంగా ఇటలీలోనే 26,384 మంది ఇప్పటివరకు మరణించినట్లు వెల్లడించారు. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 1,95,000కు చేరినట్లు స్పష్టం చేశారు.
చైనాలో
మరోవైపు చైనాలో వైరస్ దాదాపుగా తగ్గుముఖం పట్టింది. ఇప్పటివరకు మొత్తం 82,816 కేసులు నమోదు కాగా...77, 346 మంది కోలుకున్నారు. 4,632 మంది మరణించారు. కేవలం 838 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. శనివారం కొత్తగా 12 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
సింగపూర్
సింగపూర్‌లో మరో 618 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం బాధితుల సంఖ్య 12,693 చేరినట్లు తెలిపారు. దేశంలో మొత్తం 12 మంది మరణించినట్లు స్పష్టం చేశారు. కొత్తగా గుర్తించిన కేసుల్లో 397 మంది వసతి గృహాల్లో ఉంటున్న విదేశీ వర్క్ పర్మిట్ హోల్డర్సే అని వెల్లడించారు.