కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలు దాటాయి. గురువారం ఒక్కరోజే 79 వేల 747 కేసులు నమోదుకాగా.. 5 వేల 974 మరణాలు సంభవించాయి. మొత్తం కేసులు 10 లక్షల 15 వేలపైనే. మృతుల సంఖ్య 53 వేలు దాటింది. ఇందులో సగంకంటే ఎక్కువ మంది ఐరోపావాసులే.
24 గంటల్లో 1,350కిపైగా..
ఫ్రాన్స్‌లో ఇప్పుడిప్పుడే తీవ్రరూపం దాలుస్తున్న కరోనా.. గురవారం మరణమృందం మోగించింది. 24 గంటల వ్యవధిలో అక్కడ మరో 1,355 మంది ప్రాణాలు కోల్పోవడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. మరో 2 వేలకుపైగా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 60 వేలకు చేరువైంది.
30వేల కేసులు..
కరోనా కేసుల పరంగా అమెరికాలో రోజురోజుకూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. నిన్న అక్కడ మరో 29 వేల 974 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 968 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 6 వేల 70కి చేరింది. మొత్తం కేసులు 2 లక్షల 50 వేలకు చేరువలో ఉన్నాయి.