ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. పలు దేశాల్లో వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య కోటి 10 లక్షలు దాటింది. ఇప్పటివరకు 5,24,881 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 61,78,566 మంది ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 43,20,010 యాక్టివ్ కేసులున్నాయి.
అగ్రరాజ్యం..
అత్యధికంగా అమెరికాలో 28 లక్షల కేసులు నమోదయ్యాయి. లక్షా 31 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 11.91 లక్షల మంది వైరస్‌నుంచి కోలుకున్నారు. మరో 15.14 లక్షల మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలందరూ మాస్కులు ధరించి ఇళ్లలోనే ఉండాలని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పిలుపునిచ్చారు. వారాంతపు సెలవుల్లో సాంప్రదాయ వేడుకలు నిర్వహించొద్దని కోరారు.
మాస్కులు ధరించే విషయంలో కాలిఫోర్నియా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు క్రిమినల్ చర్యలు చేపడతామని దాదాపు 3.5 లక్షల మంది వ్యాపారులకు లేఖ రాశారు.
దక్షిణాఫ్రికా..
దక్షిణాఫ్రికాలో కరోనా రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ప్రత్యేక వార్డులతో పాటు సాధారణ వార్డుల్లోనూ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వసతుల లేమితో పలు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
లాక్డౌన్ సడలించడం వల్ల కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. కొద్దిరోజులుగా కేప్‌టౌన్‌లో వైరస్ విజృంభన కొనసాగగా... ప్రస్తుతం జొహనస్బర్గ్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో జొహనస్బర్గ్లో మళ్లీ ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. అధిక వేగంతో వ్యాపిస్తున్న వైరస్‌ను అడ్డుకోవడానికి అదే ప్రత్యామ్నాయమని పేర్కొంటున్నారు.
కరోనా కారణంగా దేశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయని.. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా పేర్కొన్నారు. కరోనా తీసుకొచ్చిన సవాళ్లకు పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్షా 60 వేలు దాటాయి. 2,800 మందికిపైగా మరణించారు. తీవ్రమైన చలి వాతావరణం ఉండటం వల్ల రెండువారాలకు ఒకసారి కేసులు రెట్టింపు అవుతున్నట్లు అధికారులు తెలిపారు.
సియోల్‌లో మళ్లీ..
దక్షిణ కొరియాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 63 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 12,967కి చేరింది. మరణాల సంఖ్య 282గా ఉంది.