ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతున్న ఏకైక ప్రాంతంగా ఐరోపా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఐరోపా దేశాలన్నింట్లోనూ వరుసగా ఆరో వారం కేసుల సంఖ్య పెరిగిందని తెలిపింది. అలాగే గత వారంలో ఐరోపా కరోనా వైరస్ మరణాలు 10శాతం పెరిగాయని వివరించింది. ఈ మేరకు కరోనాపై డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన వారాంతపు నివేదికను గమనిస్తే..
- ప్రపంచవ్యాప్తంగా ఒక శాతం(1%) పెరిగి 31 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి.
- మొత్తం కేసుల్లో మూడింట రెండు వంతులు(19లక్షలు) అంటే ఏడు శాతం(7%) కేసులు ఐరోపాలో వెలుగుచూశాయి.
- కొత్త కేసులు అధికంగా నమోదైన దేశాలు అమెరికా, రష్యా, బ్రిటన్, టర్కీ, జర్మనీ.
- ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య నాలుగు శాతం(4%) తగ్గింది.
- ఐరోపాతో పాటు.. రష్యా, మధ్య ఆసియా దేశాల్లో గత వారం కేసుల సంఖ్య 10 శాతం పెరిగింది.
- అమెరికాలో కొత్త కేసులు ఐదు శాతం, మరణాలు 14 శాతం తగ్గాయి.
- ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో టీకాల పంపిణీ లేనప్పటికీ కొవిడ్ మరణాలు మూడింట ఒక వంతు తగ్గాయి.
ఐరోపా మరోసారి "కరోనాకు కేంద్రం"గా మారిందని డబ్ల్యూహెచ్ఓ ఐరోపా సంచాలకులు డాక్టర్ హన్స్ క్లూగే ఆందోళన వ్యక్తం చేశారు. 'మహమ్మారి విజృంభణకు అడ్డుకట్ట వేయకపోతే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఐరోపాలో మరో ఐదు లక్షల మరణాలు నమోదవుతాయి' అని హెచ్చరించారు.
జర్మనీలో కోరలు చాస్తున్న కరోనా..
జర్మనీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అక్కడ రోజూ రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఏకంగా 39,676 కేసులు వెలుగుచూశాయి.
గత వారం రోజులుగా ప్రతి లక్ష మందిలో 232.1 కొత్త కేసులు వెలుగుచూసినట్లు రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. ఐసీయూలు కొవిడ్ రోగులతో నిండి ఉన్నాయని.. ప్రస్తుతానికి కొత్త రోగులను చేర్చుకోలేమని అనేక ఆసుపత్రులు ప్రకటించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో టీకాల పంపిణీని వేగవంతం చేయాలని ప్రముఖ వైరాలజిస్టు ఒకరు సూచించారు. లేదంటే దేశంలో మరోసారి లాక్‌డౌన్ తప్పదని హెచ్చరించారు.
'ప్రస్తుతం నిజమైన అత్యవసర పరిస్థితిలో ఉన్నట్లుగా ఉంది' అని బెర్లిన్ చారిట్ హాస్పిటల్ వైరాలజీ హెడ్ క్రిస్టియన్ డ్రోస్టెన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఐసీయూల్లో పరిస్థితిపై స్పందిస్తూ ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. 'లాక్‌డౌన్‌లు విధించే ఉద్దేశం లేదని ప్రభుత్వం చెబుతోంది. దానికి బదులుగా టీకాల పంపిణీని వేగవంతం చేయాలి' అని విజ్ఞప్తి చేశారు.
"దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. టీకాల పంపిణీ కార్యక్రమం త్వరగా చేపట్టకపోతే కనీసం మరో లక్ష మంది కరోనాతో చనిపోయే ప్రమాదం ఉంది. ఇంకా కోటి యాభై లక్షల మంది టీకాలు తీసుకోవాల్సిన వారున్నారు."