9 వేలు దాటిన కరోనా మరణాలు- ఐరోపాలో స్వైరవిహారం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి 9,020 మంది మరణించారు. ఐరోపాలో అత్యధికంగా 4,134 మంది మృత్యువాత పడగా... ఆసియాలో 3,416 మంది వైరస్‌కు బలయ్యారు.
ఐరోపాలో కరోనా స్వైర విహారం చేస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 712 మంది మరణించడం ఆయా దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఐరోపా వ్యాప్తంగా 90,293 కరోనా కేసులు నమోదయ్యాయి.
30శాతం అధికం
స్పెయిన్‌లో కరోనా మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే 30 శాతం అధిక మరణాలు సంభవించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం మృతుల సంఖ్య 767కి చేరినట్లు స్పష్టం చేసింది. దేశంలో 17,147 కేసులు నమోదైనట్లు తెలిపింది.
జర్మనీలో 11 వేల కేసులు
జర్మనీలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 2,801 మందికి వైరస్ సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు. మొత్తం కేసుల సంఖ్య 10,999కి చేరినట్లు వెల్లడించారు. జర్మనీలో ఇప్పటివరకు 20 మంది కరోనాకు బలయ్యారు.
ఇరాన్లో 149మంది బలి
ఇరాన్లో మరో 149 మంది కరోనా వైరస్ బారిన పడి మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,284కి చేరుకుంది. దేశవ్యాప్తంగా 18,407 కేసులు నమోదైనట్లు వెల్లడించింది.
వాఘా సరిహద్దు మూసివేత
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్ నుంచి రాకపోకలు సాగించే కీలకమైన వాఘా సరిహద్దును రెండు వారాలపాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేసే విధంగా ఇరుదేశాల ప్రయోజనాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. పాకిస్థాన్ పశ్చిమ భాగాన ఉన్న ఇరాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దులను ఇదివరకే మూసేసింది.
పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 341 మందికి కరోనా వ్యాపించగా.. ఇద్దరు మరణించారు. అత్యధికంగా సింధ్‌లో 211, బలోచిస్థాన్‌లో 45, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 34 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:దేశంలో కరోనాకు మరొకరు బలి- 4కు చేరిన మృతులు