తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాకు 7 వేల మంది బలి- 1.75 లక్షల మందికి వైరస్​ - కరోనా వైరస్ మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. చైనాలో దాదాపు తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి.. ఐరోపాలో విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 1.75 లక్షలకు చేరగా.. 7 వేల మంది మరణించారు. ఇటలీలో ఒక్కరోజే 349 మంది మృత్యువాత పడ్డారు.

virus
కరోనా

By

Published : Mar 17, 2020, 4:58 AM IST

Updated : Mar 17, 2020, 6:21 AM IST

కరోనాకు 7 వేల మంది బలి

చైనాలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుతున్న వేళ ఇతర దేశాల్లో విజృంభిస్తోంది. ఐరోపాలో అత్యధిక కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి.

కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7,007 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా తర్వాత ఇటలీలో అత్యధికంగా మరణించారు. ఇటలీలో ఈ ఒక్కరోజే 349 మంది మరణించగా.. ఆ దేశంలో మొత్తం మృతుల సంఖ్య 2,158కు చేరుకుంది. రెండురోజుల్లో 700 మంది మరణించారు. చైనాలో 3,213 మంది బలయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడిన వారి సంఖ్య 1,75,536కు చేరుకుంది. ఇటలీలో 28,000 కేసులు నమోదయ్యాయి.

ఇరాన్​లోనూ...

ఇటలీ తర్వాత ఇరాన్​లో వైరస్​ వ్యాప్తి అధికంగా ఉంది. ఇరాన్​లో కరోనా మరణాలు 853కు చేరుకున్నాయి. సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవటం వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతోందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

ఇరాన్​లో కరోనా విజృంభణ నేపథ్యంలో నాలుగు ప్రముఖ పవిత్ర స్థలాలను మూసివేసింది అక్కడి ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఈ పరిస్థితుల్లో ఇరాన్​ నుంచి తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు అఫ్గానిస్థాన్​ చర్యలు వేగవంతం చేసింది. 20 రోజుల వ్యవధిలో 70 వేల మంది అఫ్గాన్లు కాబూల్​కు చేరుకున్నారు.

పాక్​లో ఒక్కరోజే..

పాక్​లో ఒక్కసారిగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో 131 కేసులు నమోదు కాగా.. మొత్తం 186 పాజిటివ్​ కేసులను గుర్తించారు అధికారులు. వైరస్​ కేసులు పెరిగితే ఇబ్బందులు తప్పవని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ ఆవేదన వ్యక్తంచేశారు. వైద్య సదుపాయాలు సరిగా లేకపోవటమే ఇందుకు కారణమని తెలిపారు.

అమెరికాలో కట్టడి పెంపు..

అమెరికాలో పెరుగుతున్న కేసుల కారణంగా తమ పౌరులకు మరిన్ని సూచనలు చేసింది శ్వేతసౌధం. 50 మందికిపైగా గుమికూడవద్దని స్పష్టం చేసింది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 69 మంది మరణించగా.. 3,777 మందికి వైరస్ సోకింది.

ఫ్రాన్స్​లో..

ఇటలీ తరహాలో ఫ్రాన్స్​లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 127 మంది ప్రాణాలు కోల్పోగా.. నిన్న ఒక్కరోజే 36 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 900 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా పౌరులు బయటికి రావొద్దని ఫ్రాన్స్​ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో దేశంలో నగరాలన్నీ బోసిపోయాయి.

Last Updated : Mar 17, 2020, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details