ప్రపంచదేశాల్లో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 85,79,700 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వైరస్ సోకి 4,56,262 మంది మృతి చెందారు.
అమెరికాలో పరిస్థితులు ఏమాత్రం అదుపులోకి రావటం లేదు. తాజాగా 27 వేల మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 22.63 లక్షలకు చేరింది. ఇప్పటివరకు అమెరికాలో 1.2 లక్షలకు పైగా కరోనా ధాటికి బలయ్యారు.
బ్రెజిల్లో భారీగా..
బ్రెజిల్ లోనూ వైరస్ కేసులు భారీ సంఖ్యలోనమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 23 వేల మందికి వైరస్ సోకగా.. మొత్తం సంఖ్య 9.83 లక్షలకు పెరిగింది. 47 వేల మంది మృత్యువాత పడ్డారు.
రష్యాలో ఇలా..
రష్యాలో కరోనా బాధితులు పెరుగుతూనే ఉన్నారు. కొత్తగా 7,790 మందికి వైరస్ పాజిటివ్ అని నిర్ధరించగా, మొత్తం 5.61 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 7,660 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఐరోపాలో మళ్లీ అలజడి..
కరోనా కోరల్లో నుంచి దాదాపు బయటపడినట్లే కనిపించిన పలు ఐరోపా దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా జర్మనీ, గ్రీస్‌లలో కొద్ది రోజులుగా వైరస్ తీవ్రత అధికమవుతోంది.
జర్మనీలో..
జర్మనీ గ్వెటెర్స్లో నగరంలోని ఓ జంతు వధశాల తాజాగా కరోనా వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా నిలిచింది. అక్కడ 657 మంది వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యారు. అప్రమత్తమైనఅధికారులు గ్వెటెర్స్లోలో జన సంచారంపై నిషేధాజ్ఞలు విధించారు.
గ్రీస్‌లో లాక్డౌన్..
గ్రీస్‌లో గ్జాంథీ రాష్ట్రంలోని ఎకినోస్ గ్రామంలో కరోనా సంబంధిత మరణాలు, కేసులు ఒక్కసారిగా పెరిగాయి. అక్కడ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను విధించారు. ఆహారం, ఔషధాల కోసం మినహా ఇతర పనులపై ప్రజలు బయటకు రాకుండా నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. గత కొన్ని వారాలుగా ఒక్క కేసు కూడా రాని బాల్కన్ దేశం మాంటెనీగ్రోలో మళ్లీ వైరస్ ఉనికి బయటపడింది.
ఆంక్షల ఎత్తివేతతో..
టర్కీలోని ఇస్తాంబుల్, అంకారా సహా పలు నగరాల్లో ఆంక్షల ఎత్తివేత అనంతరం కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించటాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
బీజింగ్‌లో మెరుగుపడుతున్న పరిస్థితులు..
చైనా రాజధాని బీజింగ్‌లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. బుధవారం అక్కడ 31 కేసులు నమోదు కాగా, గురువారం 21 మంది వైరస్ పాజిటివ్‌గా తేలారు. నగరంలని షిన్ఫఢీ మార్కెట్ కేంద్రంగా గత వారం వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం కలకలం సృష్టించింది.