మహమ్మారి కరోనా ధాటికి ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. రోజురోజుకూ ఈ కేసులు అధికంగా నమోదవుతుండగా ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 18,500లకుపైగా మంది ఈ వైరస్ సోకి మృతి చెందారు. 174 దేశాల్లో 4,15,000వేలకుపైగా మందికి ఈ మహమ్మారి సోకింది. చాలా దేశాలు కొవిడ్-19కు విరుగుడు కనుగొనేందుకు నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఆయా దేశాల్లో ఇలా..
ఇటలీలో 24 గంటల్లో 743 మంది మృతి
ఇటలీలో కరోనా మృతుల సంఖ్య మంగళవారం మళ్లీ పెరిగింది. అంతకుముందు రెండు రోజుల పాటు మరణాల సంఖ్యలో తగ్గుముఖం పట్టినప్పటికీ.. తిరిగి మళ్లీ విజృంభించింది మహమ్మారి. గడిచిన 24 గంటల్లో 743 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 5,249 మందికి వైరస్ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 69,176కు చేరింది. ఈ నేపథ్యంలో రెండు వారాలపాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం.
అమెరికాలో 600కు చేరిన మరణాలు..
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరణాలు 600కు చేరాయి. కరోనా సోకిన వారి సంఖ్య 49,768కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్యలో చైనా తర్వాత అమెరికా మూడోస్థానంలో ఉంది. సామాజిక దూరం, క్వారంటైన్ వంటి చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. అయితే.. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించబోమని స్పష్టం చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
ఫ్రాన్స్‌లో మరో 240 మంది మృతి
ఫ్రాన్స్‌లోనూ కోరనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. మంగళవారం ఒక్కరోజే 240 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 1,100కు చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం 22,300 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.