Corona cases in world: ప్రపంచవ్యాప్తంగా గతవారం 1.8కోట్ల కరోనా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతకుముందు వారంతో పోల్చితే కేసులు 20 శాతమే పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది. మరణాల సంఖ్య మాత్రం స్థిరంగా 45వేలుగా ఉన్నట్లు పేర్కొంది. ఆఫ్రికా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా కేసులు పెరిగినట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గినందు వల్లే కేసుల వృద్ధి శాతం తక్కువ ఉందని అభిప్రాయపడింది. అంతకుముందు వారం, గత నెలలో కేసులు 50శాతం పెరిగాయని గుర్తు చేసింది.
అన్ని ప్రాంతాలతో పోల్చితే నైరుతి ఆసియాలో కేసుల వృద్ధి గణనీయంగా ఉందని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. ఈ దేశాల్లో కొవిడ్ కేసులు వారంలో 145శాతం పెరిగినట్లు పేర్కొంది. పశ్చిమాసియాలో ఈ శాతం 68గా ఉన్నట్లు పేర్కొంది.
డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం అమెరికా, ఐరోపా దేశాల్లో కేసుల వృద్ధి 17, 10శాతంగానే ఉంది. ఒమిక్రాన్ పీక్ దశకు చేరి తగ్గుముఖం పట్టడం వల్లే కేసులు పెరుగుదల తక్కువగా నమోదైంది. రానురాను ఈ దేశాల్లో కేసులు ఇంకా తగ్గుతాయి.
ఆంక్షలు ఎత్తివేత..
ఒమిక్రాన్ వేరియంట్ పీక్ దశను అధిగమించినట్లు గణాంకాలు చెబుతున్నాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. కేసులు తగ్గుముఖం పడుతున్నందున ఒమిక్రాన్ కట్టడి కోసం అమలు చేస్తున్న ఆంక్షలను వచ్చే గురువారం నుంచి ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.
జపాన్లో కొత్త ఆంక్షలు
ఒమిక్రాన్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న కారణంగా శుక్రవారం నుంచి కొత్త ఆంక్షలు విధించనుంది జపాన్. రాజధాని టోక్యో సహా పలు ప్రాంతాల్లో ఫిబ్రవరి 13వరకు నూతన నిబంధనలను అమలు చేయనుంది. రెస్టారెంట్ల సమయాన్ని తగ్గించనుంది. శుక్రవారం ఇందుకు సంబంధించి ప్రధాని ఫుమియో కిషిదా అధికారిక ప్రకటన చేయనున్నారు.