దేశం వీడి పారిపోయిన ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ సోదరుడు చేతన్ చినూ భాయ్ ఛోక్సీ.. డొమినికా ప్రతిపక్ష నేత లెనాక్స్ లింటన్‌ను రహస్యంగా కలిసినట్లు తెలుస్తోంది. పోలీసులకు చిక్కిన తన తమ్ముడిని భారత్‌కు అప్పగించకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరినట్లు సమాచారం. ఇలా చేస్తే వచ్చే ఎన్నికల ఖర్చుకు నిధులు సమకూర్చుతామని చేతన్ హామీ ఇచ్చాడని, ఈ మేరకు లెనాక్స్తో అతను ఒప్పందం కుదుర్చుకున్నాడని స్థానిక వార్తా సంస్థ వెల్లడించింది.
ఇదీ చూడండి: గర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లడమే ఛోక్సీ కొంపముంచిందా?
చోక్సీ అంశాన్ని డొమినికా పార్లమెంట్లో లేవనెత్తాలని, అతడిని భారత్‌కు అప్పగించకుండా చేయాలని చేతన్ ప్రతిపక్ష నేతను కోరినట్లు వార్తా సంస్థ పేర్కొంది. ఇద్దరి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చ జరిగిందని తెలిపింది. మెహుల్ చోక్సీ స్వతహాగా డొమినికా చేరుకున్నాడని, కానీ అతడ్ని పోలీసులు కిడ్నాప్ చేశారని నమ్మించేలా చేసి కోర్టులో గెలిచేందుకు సహకరించాలని చేతన్ అడిగినట్లు చెప్పింది. ఈ ఒప్పందం కోసం చేతన్ చోక్సీ మే 29న ఓ ప్రైవేటు జెట్‌లో డొమినికా వెళ్లినట్లు వివరించింది.