Changes in young generation: 'సహస్రాబ్ది తరం'.. 'మిలీనియం జనరేషన్'గా పిలుచుకొనే ఈ కాలంలోని యువత నిజంగా మరో యుగం దూతలే. నూతన భావాలతో పాటు బాధ్యతలను ఇంట, ఒంట పట్టించుకున్న యువతరం. స్పష్టమైన ఆలోచనలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్న నవతరం. చేతిలో బీరు సీసా లేకుండా హ్యాపీ న్యూ ఇయర్ ఏమిటీ అని అనుకొనే రకం కాదు. మద్యపానం వ్యసనమే తప్ప, ఆనందం కలిగించదని గుర్తించి దానికి దూరమవుతున్న కొత్త తరం. ఇదే వయసులో ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులతో పోల్చితే ఇప్పటివారిలో తాగుడు వ్యసనం బాగా తగ్గింది. ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, బ్రిటన్, నార్వే, ఫిన్‌లాండ్ వంటి పాశ్చాత్య దేశాల్లోని యువతపై లా ట్రోబ్, షెఫీల్డ్, స్టాక్‌హోం విశ్వవిద్యాలయాల పరిశోధకులు జరిపిన సర్వేలో ఈ ఆశ్చర్యకరమైన ఫలితం వెల్లడయింది. ఈ సహస్రాబ్ది ప్రారంభం నుంచే ఈ మార్పు కనిపిస్తుండడం విశేషం.
Millennials drinking habits
యువతలో తాగుడు వ్యసనం తగ్గడానికి ప్రభుత్వాలు అమలు చేసిన విధానాలేవీ కారణం కాదు. విస్తృతమైన సాంఘిక, సాంస్కృతిక, సాంకేతిక, ఆర్థిక మార్పులే దోహదం చేశాయి. పరిశోధకులు ప్రధానంగా నాలుగు కారణాలను గుర్తించారు.
- భవిష్యత్తుపై అస్పష్టత, తద్వారా కలిగిన ఆందోళన
- ఆరోగ్యంపై అవగాహన
- సాంకేతిక రంగం, విశ్రాంతిల్లో మార్పులు
- అన్నింటికన్నా ముఖ్యంగా తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడడం...
Millennials developed countries
మునుపటితో పోల్చితే అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితులు మారాయి. తమ భవిష్యత్తు భద్రమేమీ కాదని యువత గుర్తించింది. కెరీర్‌ను ఎంచుకోవడం నుంచి ఇల్లును సమకూర్చుకోవడం వరకూ అన్నీ సులభమైన వ్యవహారాలేమీ కావు. చిన్నతనం నుంచే చదువుల ఒత్తిడి పెరిగింది. జీవితంపై అదుపు ఉన్నప్పుడే లక్ష్యాలను నెరవేర్చుకోగలమన్న ఆలోచన అంకురించింది. మునుపటి తరాలకు ఈ బాధ, బెడద ఏమీ ఉండేది కాదు. టీనేజీ నుంచి యువతరానికి మారే సంధికాలంలో మందు కొట్టడం 'ఆచారం'గా ఉండేది. ఇప్పుడు మాత్రం సాధ్యమైనంత త్వరగా బాధ్యతాయుత, స్వతంత్ర జీవితంలో ప్రవేశించాలని యువత ఆశిస్తోంది. తాగుడుకు అలవాటు పడితే ఈ లక్ష్యం దెబ్బతింటుందని భావించి అందుకు దూరంగా ఉంటోంది. భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించడం అంటే మందు పార్టీలకు ధనం, కాలాన్ని వెచ్చించకపోవడమే.
Generation Y characteristics