'జూమ్' వేదికగా బ్రిటన్ పార్లమెంటు 'హౌస్ ఆఫ్ లార్డ్స్ కమిటీ' సమావేశం జరుగుతోంది. చట్టసభసభ్యులు చాలా సీరియస్గా చర్చలు జరుపుతున్నారు. ఇంతలో ఓ పిల్లి వచ్చి వీరందరినీ పలకరించింది. ఇదే వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. అసలు ఈ సమావేశం మధ్యలో పిల్లి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఏం జరిగిందో మీరే చదివి తెలుసుకోండి.
ఏం జరిగింది?
సభ్యులందరూ సమావేశంలో లీనమై మాట్లాడుతున్నారు. ఇతర సభ్యులతో కలిసి బ్రిటన్ వాణిజ్య నిపుణురాలు సెల్లీ జోన్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓ అంశంపై జోన్స్ మాట్లాడుతుండగా.. ఇంతలో ఓ పిల్లి ఆడుకుంటూ ఆమె ఒడిలోకి వచ్చి చేరింది. అది ఎవరో కాదు.. జోన్స్ పెంపుడు జంతువు. అయితే ఆమె సమావేశంలో ఉన్నందున పిల్లిని ఇతరులకు కనిపించకుండా చూసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. కానీ సాధ్యపడలేదు. అంతే.. పిల్లి ఒక్కసారిగా కెమెరా ముందు ప్రత్యక్షమైంది.
దీంతో సమావేశంలో పాల్గొన్న అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యమైన చర్చకు పిల్లి ఆటంకం కలిగించినందున సహచరులకు క్షమపణలు చెప్పారు జోన్స్. అనంతరం ఆ పిల్లిని ఒడిలోనే కూర్చోబెట్టుకుని చర్చలు జరిపారు. జూన్ 4 నాటి ఈ దృశ్యాన్ని మాట్ కొరీస్ అనే పార్లమెంటరీ క్లర్క్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.