కొవిడ్-19తో పాటు అన్ని రకాల కరోనా వైరస్‌లతో పోరాడే వ్యాక్సిన్‌ను తయారు చేయనున్నట్లు ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ వెల్లడించింది. భవిష్యత్తులో జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్ల నుంచి ఇది కాపాడుతుందని తెలిపింది.
'డీఐఓఎస్-కొవాక్స్-2' పేరుతో తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్ క్యాండిడెట్లో అన్ని రకాల కరోనా వైరస్ జన్యు శ్రేణులను ఉపయోగించనున్నారు. కరోనా ఉద్భవించిందని అనుమానిస్తున్న గబ్బిలాల జన్యు క్రమాన్నిసైతం వినియోగిస్తున్నారు.
"మా విధానంలో భాగంగా సార్స్-కొవ్-2(కొవిడ్-19) కంప్యూటర్ ఆధారిత త్రీడీ నిర్మాణం ఉంటుంది. ఇది సార్స్, మెర్స్ సహా భవిష్యత్తులో మానవ అంటువ్యాధులకు కారణమయ్యే వైరస్ల సమాచారాన్ని ఉపయోగించుకొని పనిచేస్తుంది. రోగనిరోధక ప్రతి స్పందనను సరైన స్థితిలో నడిపించే వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నాం. ఇందులో ఉపయోగించేందుకు అవసరమయ్యే రక్షణ కవచం కోసం వైరస్‌పై పరిశోధన చేస్తున్నాం. కొవిడ్-19 మాత్రమే కాకుండా జంతువుల నుంచి మానవులకు వ్యాపించే ఇతర కరోనా వైరస్ల నుంచి రక్షించే వ్యాక్సిన్‌ను తయారు చేయడమే మా అంతిమ లక్ష్యం."
-ప్రొఫెసర్ జొనథన్ హీనే, వైరల్ జూనొటిక్స్ లేబరేటరీ హెడ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం
సింథటిక్ జన్యువులతో ఎన్కోడ్ చేసిన కంప్యూటర్ ఆధారిత యాంటీజెన్ నిర్మాణాలను హీనే బృందం తయారు చేసింది. ఇది వైరస్‌ను లక్ష్యంగా చేసుకొని, యాంటీవైరల్ ప్రతిస్పందనలను ఉత్పత్తి చేసే విధంగా మానవ రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది. తద్వారా వైరస్ ఉన్న ప్రాంతంలోనే టీకా అధికంగా ప్రభావం చూపుతుంది.
విప్లవాత్మకమైన విధానం..
ఈ విధానం ఫలిస్తే తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే సురక్షితమైన వ్యాక్సిన్ తయారైనట్లేనని పరిశోధకురాలు, డైయోసిన్వాక్స్ సీఓఓ డాక్టర్ రెబెకా కిన్స్లే పేర్కొన్నారు.