ఏదో ఒక సందర్భంలో ఒక పనిని మరిచిపోతేనే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటిది మతిమరుపే వ్యాధిగా ఉంటే.. వారి పరిస్థితి ఊహించటానికే ఇబ్బందిగా ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారి కోసం బ్రిటన్ శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతను తీసుకొచ్చారు.
కదిలే బొమ్మల టేబుళ్లు, సంగీత పెట్టెల సాయంతో మతిమరుపుతో బాధపడుతున్న వారి మెదడును ఉత్తేజపరిచి.. వారు స్వతంత్రంగా పనులు చేసుకునేలా చికిత్స అందిస్తున్నారు. నాడీ వ్యవస్థ, సంభాషణ నైపుణ్యాలు, భౌతిక సామర్థ్యాలు మెరుగయ్యేందుకు ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతోందని పేర్కొంటున్నారు.
మతిమరుపు చివరి దశలో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఈ పద్ధతిని తయారు చేసినట్లు ఓమ్ ఇంటరాక్టివ్ సంస్థ పేర్కొంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో కెన్సింగ్టన్ ఒలింపియాలో రెండు రోజుల పాటు వీటి ప్రదర్శన చేపట్టారు.
" సహజంగా ఈ సాంకేతికతలోని సంగీతం మెదడులోని నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఇతర పద్ధతుల్లో భౌతికంగా, మానసికంగా ఉత్తేజపరచొచ్చు. రంగురంగుల్లో వెలిగిపోతూ గొప్పగా అనిపించే కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా అంతా స్వేచ్ఛగా గడుపుతుంటారు. అయితే మతిమరుపును పూర్తి స్థాయిలో ఇది నయం చేయదు. ఈ పద్ధతి బాధితులకు మంచి జీవితాన్ని ఇస్తుంది. వారి మెదడును చురుకుగా, ఉత్తేజంగా ఉంచుతుంది."