తెలంగాణ

telangana

By

Published : Dec 13, 2019, 3:28 PM IST

Updated : Dec 13, 2019, 6:17 PM IST

ETV Bharat / international

బ్రిటన్​ ప్రధానిగా మరోసారి బోరిస్​- ఇక బ్రెగ్జిట్​ లాంఛనమే!

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో పాలక కన్జర్వేటివ్ పార్టీ చారిత్రక విజయం సాధించింది. 650 సీట్లలో దాదాపు 363 సీట్లను గెలుపొంది బోరిస్​ జాన్సన్​ విజయఢంకా మోగించారు. బ్రెగ్జిట్​ నినాదంతో భారీ మెజార్టీ సాధించారు. మరోసారి బోరిస్​ ప్రధాని కానుండటం వల్ల బ్రెగ్జిట్​ ఇక లాంఛనమే!

British PM Johnson wins historic election, hails new dawn' of end to Brexit deadlock
బ్రిటన్​ ప్రధానిగా మరోసారి బోరిస్​- ఇక బ్రెగ్జిట్​ లాంఛనమే!

బ్రిటన్​ ప్రధానిగా మరోసారి బోరిస్​- ఇక బ్రెగ్జిట్​ లాంఛనమే!

ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలే నిజమయ్యాయి. బ్రిటన్​ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్​ పార్టీ నేత బోరిస్​ జాన్సన్ భారీ విజయాన్ని నమోదు చేశారు. బ్రెగ్జిట్​ నినాదంతో ఎన్నికల బరిలో నిలిచిన అధికార పక్షంవైపే బ్రిటన్​ వాసులు మొగ్గు చూపారు. 650 సీట్లకు గాను సగానికిపైగా స్థానాలను బోరిస్​ జాన్సన్​కు కట్టబెట్టారు.

ఎన్నికల ఫలితంపై బోరిస్ హర్షం వ్యక్తంచేశారు. బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తిచేసి, వచ్చే నెలలో ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ను బయటకు తీసుకురావడానికి ప్రజలు తమకు శక్తిమంతమైన అధికారాన్ని ఇచ్చారని ఈ రోజు లండన్​లో వ్యాఖ్యానించారు.

లేబర్ పార్టీ ఓటమికి బ్రెగ్జిట్ అంశమే కారణమని పార్టీ నేత జెరేమీ కార్బిన్​ అభిప్రాయపడ్డారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు.

బ్రెగ్జిట్​ సునామీ...

దిగువ సభ 'హౌస్ ఆఫ్ కామన్స్‌'లో మొత్తం 650 స్థానాలకు ఓటింగ్​ జరిగింది. మెజారిటీ సాధించాలంటే కనీసం 326 స్థానాల్లో గెలవాలి. అయితే బ్రెగ్జిట్​ సునామీకి లేబర్ పార్టీ కంచుకోటలు బద్దలయ్యాయి.

లేబర్ పార్టీ ఒకప్పటి కంచుకోటలైన బ్లిత్, డార్లింగ్టన్, వర్కింగ్టన్ లాంటి స్థానాల్లో కన్జర్వేటివ్ పార్టీ జెండా ఎగరేసింది. ఉత్తర ఇంగ్లండ్, మిడ్‌‌ల్యాండ్స్‌, వేల్స్‌లలో 'బ్రెగ్జిట్'కు మొగ్గుచూపిన ప్రాంతాల్లోని సీట్లను అధికార పక్షం నిలబెట్టుకుంది.

పెరిగిన మెజార్టీ...

ప్రధాని బోరిస్ జాన్సన్, లేబర్ పార్టీ నాయకుడు జెరిమీ కార్బిన్ తమ తమ స్థానాల్లో విజయం సాధించారు. గత ఎన్నికలతో పోలిస్తే పశ్చిమ లండన్లోని ఉక్స్‌బ్రిడ్జ్ స్థానంలో బోరిస్ జాన్సన్ మెజారిటీ పెరగ్గా, ఇస్లింగ్టన్ నార్త్ నియోజకవర్గంలో కార్బిన్‌ మెజారిటీ తగ్గింది.

బ్రెగ్జిట్​ ఎన్నికలు...

బ్రెగ్జిట్‌పై పార్లమెంట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వైదొలగడమే ప్రధాన అంశంగా ఈ ఎన్నికలు జరగడం వల్ల ఇవి 'బ్రెగ్జిట్‌ ఎన్నికలు'గా ప్రాచుర్యం పొందాయి. గురువారం ఈ ఎన్నికలు జరగగా.. నేడు ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు శతాబ్దం తర్వాత యూకేలో డిసెంబరులో ఎన్నికలు జరగడం తొలిసారి.

అనుకున్న సమయానికే...

బోరిస్​ జాన్సన్​ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో తదుపరి గడువైన 2020 జనవరి 31 లోపు బ్రెగ్జిట్​ ఒప్పందం పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

మోదీ శుభాకాంక్షలు...

ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బోరిస్​కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

"భారీ మెజార్టీతో మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న బోరిస్​ జాన్సన్​కు శుభాకాంక్షలు. భారత్​-యూకే సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా ఆయనతో పనిచేసేందుకు వేచి చూస్తున్నాను." - ప్రధాని మోదీ ట్వీట్

పండగ చేస్కో: ట్రంప్​

"గొప్ప విజయం సాధించిన బోరిస్​కు శుభాకాంక్షలు. బ్రెగ్జిట్​ తర్వాత అమెరికా, బ్రిటన్​ ఎప్పుడూ చూడని అతిపెద్ద ఒప్పందం చేసుకునేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటివరకూ ఐరోపా సమాఖ్య చూడనంత పెద్ద ఒప్పందం ఇదే అవుతుంది. పండగ చేస్కో.. బోరిస్​!" - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ట్వీట్​

Last Updated : Dec 13, 2019, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details