డిసెంబర్ 12న ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చేసిన ప్రతిపాదనను హౌస్ ఆఫ్ కామన్స్ అంగీకరించింది. ఇప్పటి వరకు ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తూ వస్తున్న ఎంపీలు.. అనూహ్యంగా 438 ఓట్లు వేసి 20 ఓట్ల మెజారిటీతో బోరిస్ ప్రతిపాదనను సమర్థించారు.
హౌస్ ఆఫ్ లార్డ్స్ కూడా ఈ చట్టాన్ని ఆమోదిస్తే.. 1923 తరువాత మరలా డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి అవుతుంది. అదే జరిగితే ఈ వారాంతానికి చట్టంగా మారనుంది. అపుడు పోలింగ్ రోజు వరకు 5 వారాల పాటు ఎన్నికల ప్రచారం చేసుకునే అవకాశం రాజకీయ పక్షాలకు ఉంటుంది.
బ్రెగ్జిట్ గడువు 2020 జనవరి 31 వరకు పొడిగించిన నేపథ్యంలో.. క్రిస్మస్ కంటే ముందే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని బోరిస్ పట్టుబట్టారు. తాజాగా దీనికి ఎంపీలు కూడా సరే అనడం వల్ల.. బ్రెగ్జిట్ విషయంలో ప్రజాభిప్రాయం పొందటానికి బోరిస్‌కు మంచి అవకాశం వచ్చింది.
"బ్రెగ్జిట్, దేశ భవిష్యత్తు కోసం ప్రజలు తప్పకుండా ఎన్నికల్లో పాల్గొని తమ అభిప్రాయం చెప్పాలి."
- బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని