తెలంగాణ

telangana

By

Published : Dec 25, 2019, 11:17 AM IST

ETV Bharat / international

ఇద్దరు ప్రధానులను మార్చిన బ్రెగ్జిట్​కు బోరిస్​ చెక్​​​!

బ్రిటన్​ ఎన్నికలు ముగిశాయి. ప్రధానిగా బోరిస్​ బాధ్యతలు చేపట్టారు. ఇక మిగిలింది బ్రెగ్జిట్​ మాత్రమే. ఇన్నేళ్లు దేశ పార్లమెంట్​లో అధికార కన్జర్వేటివ్​కు మెజార్టీ లేకపోవడం వల్ల అనేక బ్రెగ్జిట్​ ఒప్పందాలు వీగిపోయాయి. ఇప్పుడు పరిస్థితి మారడం వల్ల ఈ సమస్యకు స్వస్తి పలకడానికి బోరిస్​ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అయితే ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలగడం.. నిజంగా ఆ దేశానికి మంచి చేస్తుందా?

British electorate mandates quick closure of messy divorce (Brexit) with EU
ఇద్దరు ప్రధానులను మార్చిన బ్రెగ్జిట్​కు బోరిస్​ చెక్​​​!

బ్రిటన్​లో ఈ నెల 12న సాధారణ ఎన్నికలు ముగిశాయి. మునుపెన్నడూ లేని భారీ మెజారిటీతో కన్జర్వేటివ్​ పార్టీ అధికారాన్ని చేపట్టింది. కన్జర్వేటివ్​, లేబర్​, లిబరల్​ డెమోక్రట్స్​, స్కాటిష్​ నేషనల్​తో పాటు ఇతర పార్టీల మధ్య హోరాహోరీగా ఎన్నికల ప్రచారాలు జరిగాయి. కానీ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది మాత్రం​ "బ్రెగ్జిట్​". ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగడమే(బ్రెగ్జిట్​) లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగిన ప్రధాని బోరిస్​ జాన్సన్​ నేతృత్వంలోని కన్జర్వేటివ్​ పార్టీ.. అనుకున్న దాని కంటే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

650 సీట్లున్న బ్రిటిష్​ పార్లమెంట్​లో 365 గెలుచుకుని దూసుకుపోయింది. ఇది 2017 ఎన్నికలతో పోల్చితే 47 సీట్లు అధికం. బ్రెగ్జిట్​ వ్యతిరేక నినాదాలతో బరిలో దిగిన ప్రతిపక్షం లేబర్​ పార్టీ ఈ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది. కేవలం 203 సీట్లే గెలుచుకోగలిగింది. ముందు కంటే ఈ సంఖ్య 59 తక్కువ. 1935 అనంతరం ఇదే ఆ పార్టీకి అత్యల్ప సంఖ్య కావడం గమనార్హం.

2016 జూన్​ నుంచి బ్రెగ్జిట్​ సమస్య వల్ల బ్రిటన్​ తంటాలుపడుతూనే ఉంది. దీని వల్ల ఇద్దరు ప్రధానులు తమ పదవులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో బోరిస్​ ఘన విజయం సాధించడం వల్ల బ్రెగ్జిట్​కు మార్గం సుగమమైంది. దీని వల్ల ఈయూ నుంచి వైదొలగడానికి జనవరి 31 వరకు ఉన్న తుది గడువును బ్రిటన్​ సులభంగా గట్టెక్కడానికి చాలా అవకాశాలున్నాయి.

బ్రెగ్జిట్​ వల్ల ఐరోపా సమాఖ్య రూపురేఖలు మారిపోతాయి అనడానికి కూడా లేదు. ఒకప్పుడు యూరోపియన్​ ఎకనామిక్​ కమిటీ (ఈఈసీ)గా పిలిచే ఈయూ.. కేవలం 6 దేశాలతో 1957లో ఏర్పడింది. ​6 దశాబ్దాల్లో దాని సంఖ్య 28కి చేరింది. బ్రిటన్​ 1973లో ఈయూలో చేరింది.

బ్రెగ్జిట్​తో బ్రిటన్​కు లాభమేనా!

బ్రసెల్స్​(ఐరోపా సమాఖ్య ప్రధాన కార్యాలయం) నుంచి విడిపోయి సార్వభౌమాధికారాన్ని పొందడం వల్ల దేశవాసులు ఆనందించినా... బ్రిటన్ లాభపడేది పెద్దగా ఏమీ ఉండదు. ఇన్నేళ్లు ఈయూలో అగ్రరాజ్యంగా చెలామణి అయిన బ్రిటన్​.. ఇప్పుడు ఎన్నో అధికారాలు కోల్పోనుంది.

స్కాట్లాండ్​, ఉత్తర ఐర్లాండ్​, ఇంగ్లాండ్​, వేల్స్​ను కలిపి యునైటెడ్​ కింగ్​డమ్​(బ్రిటన్​) అని అంటారు. ఈయూ నుంచి వైదొలగాలని 45 శాతం స్కాట్​లాండ్​ వాసులు ఓటేశారు. అనంతర కాలంలో లండన్​తో అనేక విషయాలపై విభేదాలు ఎదురయ్యాయి. అందువల్ల బ్రెగ్జిట్​పై యూటర్న్​ తీసుకుని.. రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని స్కాట్లాండ్​ పట్టుబడుతోంది.

తాజా ఎన్నికల్లో స్కాటిష్​ నేషనల్​ పార్టీ ఊహించని విధంగా 48 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే 13 సీట్లు ఎక్కువ. అదే సమయంలో కన్జర్వేటివ్​ పార్టీ 7 సీట్లు కోల్పోయింది. దీని వల్ల స్కాట్లాండ్​ నుంచి బోరిస్​ ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత ఎదురవనుంది. ఉత్తర ఐర్లాండ్​ నుంచి కూడా బోరిస్​కు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముంది. తన వద్ద ఉన్న సరిహద్దు ప్రణాళికలను బోరిస్​ అమలు చేస్తే ఐర్లాండ్​తో సంబంధాలు క్షీణించే అవకాశముంది.

ఆర్థిక వ్యవస్థపై భారం...

బ్రెగ్జిట్​ వల్ల దేశం ఎంతో లాభపడుతుందని నేతలు ప్రకటిస్తున్నా.. ఈయూ నుంచి వైదొలిగితే బ్రిటన్​ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే సూచనలున్నాయి. దేశ జీడీపీ 3శాతం, అంతకుమించి పడిపోయే అవకాశముంది.

కేవలం బ్రెగ్జిట్​ ఒప్పందం గట్టెక్కితే సరిపోదు.. ఈయూ, అమెరికా, చైనా, భారత్​ వంటి దేశాలతో ఆర్థికంగా వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండటం బ్రిటన్​కు ఎంతో ముఖ్యం. ఇది అంత సులభమైన విషయం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాలతో సులభతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడమూ కష్టమే. ఒక వేళ ఒప్పందం కుదిరినా అది బ్రిటన్​కు అనుకూలంగా ఉంటుందని మాత్రం అనుకోలేము.

ఈ ఏడాది అక్టోబర్​ 17న ప్రధాని బోరిస్​-ఈయూ మధ్య ఒప్పందం కుదిరింది. కానీ ఆ సమయంలో బ్రిటన్​ పార్లమెంట్​లో మెజార్టీ లేకపోవడం వల్ల ఆ ఒప్పందానికి ఆమోదం లభించలేదు. తాజా ఎన్నికల అనంతరం పరిస్థితి మారడం వల్ల ఆ ఒప్పందాన్నే.. తదుపరి చర్చల కోసం బోరిస్​ వినియోగించవచ్చు.

ఇమిగ్రేషన్​ కష్టమే...!

నైపుణ్యం ఉన్నా లేకపోయినా... ఈయూ సభ్య దేశాల ప్రజలు ఇప్పటి వరకు ఇంగ్లాండ్​లో విద్య, ఉద్యోగ అవకాశాలు ఎంతో సులభంగా పొందేవారు. బ్రిటన్​ ప్రజలు బ్రెగ్జిట్​ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఇదే. బ్రెగ్జిట్​ అనంతరం ఈ పరిస్థితి మారనుంది. ఇమిగ్రేషన్​ వ్యవస్థలో విశేష మార్పులు చోటుచేసుకుంటాయి. దేశాలతో సంబంధం లేకుండా కేవలం నైపుణ్యాన్నే ప్రాధాన్యతగా పరిగణించవచ్చు.

భారత్​తో చెలిమి...

భారత్​తో లేబర్​ పార్టీ కన్నా.. కన్జర్వేటివ్​ పార్టీకే ఎక్కువ మైత్రి ఉంది. ఎన్నికల్లో బోరిస్​ విజయం సాధించిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే బోరిస్​ భారత్​ను అనేక మార్లు సందర్శించారు. మరోమారు పర్యటనకు సిద్ధపడుతున్నట్టు సమాచారం.

బ్రిటన్​ దిగువ సభ 'హౌస్​​ ఆఫ్​ కామన్స్'​కు ఈసారి ఏకంగా 15 మంది భారత సంతతి ఎంపీలు ఎన్నికయ్యారు. వీరిలో ఏడుగురు కన్జర్వేటివ్​ పార్టీకి చెందిన వారే.

ఈ ఎన్నికల్లో బ్రిటన్​లోని భారత సంఘం కన్జర్వేటివ్​వైపే అధికంగా మొగ్గు చూపింది. ఇందుకు లేబర్​ పార్టీ నిర్ణయాలు కూడా ఓ కారణం. కశ్మీర్​ అంశంలో పాకిస్థాన్​కు అనుకూల వ్యాఖ్యలు చేసింది ఆ పార్టీ. దీనిపై భారతీయులు తమ ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తపరిచారు.

ఎన్నో ఏళ్లుగా బ్రిటన్​ నేతలను ముప్పుతిప్పలు పెడుతున్న బ్రెగ్జిట్​ అంశానికి స్వస్తి పలకడానికి బోరిస్​ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. బ్రెగ్జిట్​కు గ్రీన్​ సిగ్నల్​ పడితే.. ఐరోపా సమాఖ్యలో చివరిగా చేరిన బ్రిటన్​.. ఇప్పుడు అదే ఈయూ నుంచి తప్పుకునే తొలి దేశంగా నిలవనుంది.

--- విష్ణు ప్రకాశ్​, భారత మాజీ విదేశాంగ ప్రతినిధి

ABOUT THE AUTHOR

...view details