తెలంగాణ

telangana

By

Published : May 24, 2019, 5:03 PM IST

Updated : May 24, 2019, 8:07 PM IST

ETV Bharat / international

జూన్​ 7న బ్రిటన్​ ప్రధాని 'మే' రాజీనామా

బ్రిటన్​ ప్రధాని థెరిసా మే జూన్​ 7న ప్రధానిగా, కన్జర్వేటివ్ పార్టీ సభ్యురాలిగా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. బ్రెగ్జిట్​ ఒప్పందం విషయంలో స్వపక్షంలోనూ వ్యతిరేకత రావడం వల్ల ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాజీనామా చేయనున్న బ్రిటన్ ప్రధాని థెరిసా మే

జూన్​ 7న బ్రిటన్​ ప్రధాని 'మే' రాజీనామా

బ్రెగ్జిట్​ ఒప్పందం విషయంలో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్న థెరిసా మే... ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా జూన్​ 7న ప్రధాని పదవి సహా, కన్జర్వేటివ్​ పార్టీకీ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే నూతన ప్రధాని ఎన్నికయ్యే వరకు ఆపద్ధర్మ​ ప్రధానిగా కొనసాగుతానని స్పష్టం చేశారు.

"నేను త్వరలోనే (ప్రధానమంత్రి) పదవి నుంచి వైదొలగబోతున్నాను. బ్రిటన్ లాంటి గొప్ప దేశానికి రెండో మహిళా ప్రధానిగా పనిచేయడం గర్వంగా ఉంది. (కన్నీళ్లు ఆపుకుంటూ గద్గద స్వరంతో) ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను."- థెరిసా మే, బ్రిటన్​ ప్రధానమంత్రి

లండన్​లోని డౌనింగ్​ స్ట్రీట్​లోని తన నివాసం ఎదుట థెరిసా మే రాజీనామా ప్రకటన చేశారు. జూన్​ రెండో వారంలో ప్రధాని ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాలని ఆమె సూచించారు.

ట్రంప్​కు ఆతిథ్యం ఇచ్చేది 'మే'నే...

థెరిసా మే తన రాజీనామాను గురించి.. ఇప్పటికే బ్రిటన్​ మహారాణి ఎలిజబెత్​-2కి తెలిపానని వివరించారు. దీని ప్రకారం జూన్​ మొదటివారంలో లండన్​ సందర్శనకు వచ్చే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​న​కు...థెరిసానే ఆతిథ్యం ఇవ్వనున్నట్లు స్పష్టం అవుతోంది.

బ్రెగ్జిట్ ఉచ్చు...

28 దేశాల కూటమి అయిన ఐరోపా సమాఖ్య​ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియే బ్రెగ్జిట్​. అయితే ఈ విషయంలో థెరిసా మే ప్రతిపాదించిన బ్రెగ్జిట్​ ఒప్పందానికి విపక్షాలతో సహా స్వపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆమె నోడీల్ బ్రెగ్జిట్ ప్రతిపాదనను ఇప్పటికే మూడు సార్లు తిరస్కరించింది బ్రిటన్​ దిగువసభ. ప్రస్తుతం బ్రెగ్జిట్​ గడువును మార్చి 29 నుంచి అక్టోబర్ 31 వరకు పొడిగించారు.

ఈ నేపథ్యంలో థెరిసా మే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా కన్జర్వేటివ్​ పార్టీకి చెందిన కీలకమైన 1922 కమిటీతో ఆమె సమావేశమవుతారు. అనంతరం రాజీనామా సమర్పిస్తారని తెలుస్తోంది.

మార్పేమీ ఉండదు...

యూరోపియన్ యూనియన్ మాత్రం... థెరిసా మే రాజీనామా బ్రెగ్జిట్ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం చూపబోదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: మీ శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు:మోదీ

Last Updated : May 24, 2019, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details