Britain Nuclear warheads ఉక్రెయిన్ సంక్షోభం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వస్త్ర బెదిరింపులతో ప్రపంచం ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ తరుణంలో బ్రిటన్ తన అణు వార్‌హెడ్‌లను బయటకు తీయడం వేడిని పెంచింది. వీటిని ఒక వాహనశ్రేణిలో తరలించడాన్ని ‘న్యూక్‌వాచ్ యూకే’ అనే సంస్థ తాజాగా పసిగట్టింది. ఈ ఫొటోలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఎక్కడి నుంచి ఎక్కడికి?
రీడింగ్ పట్టణ సమీపంలోని బర్‌ఫీల్డ్ గ్రామంలో ఉన్న అణుకేంద్రం నుంచి అణు వార్‌హెడ్‌లను స్కాట్లాండ్‌లోని కోల్‌పోర్టులో ఉన్న నౌకాదళ ఆయుధ డిపోకు తరలించారు. పటిష్ఠ బందోబస్తు మధ్య ఒక వాహనశ్రేణిలో 650 కిలోమీటర్ల దూరం ఇవి ప్రయాణించాయి. ఇది సాధారణ తరలింపుగానే చెబుతున్నప్పటికీ ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.
Nuclear Warheads Glasgow
ఎన్ని వార్‌హెడ్‌లు?
వాహనశ్రేణిలో మొత్తం నాలుగు వార్‌హెడ్ వాహనాలు ఉన్నాయి. ఒక్కో ట్రక్కులో రెండు వార్‌హెడ్‌లను తరలించొచ్చు. అయితే మూడు వాహనాల్లోనే అస్త్రాలను తరలించి ఉంటారని, విశ్లేషకులు తెలిపారు. ఏదైనా వాహనం మరమ్మతుకు లోనైతే ఉపయోగించడం కోసం ఒక ఖాళీ ట్రక్కును వెంట తీసుకెళ్లి ఉంటారని పేర్కొన్నారు. మొత్తంమీద ఈ వాహనశ్రేణిలో 4-6 వార్‌హెడ్‌లను తరలించి ఉండొచ్చు. ఈ అణు వార్‌హెడ్‌లను ట్రైడెంట్ క్షిపణుల్లో అమర్చాల్సి ఉంది. కోల్‌పోర్ట్‌లోని ఆయుధ డిపోలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
రోడెక్కిన బ్రిటన్ అణు వార్‌హెడ్‌లు ఏమిటీ ట్రైడెంట్?
‘ఆపరేషన్ హరికేన్’ పేరిట 1952లో బ్రిటన్ తన తొలి అణుబాంబును పరీక్షించింది. అప్పటి నుంచి అణ్వాయుధాలను కలిగి ఉంది. వీటిని ప్రయోగించేందుకు అమెరికా నుంచి ‘ట్రైడెంట్-2 డి-5’ బాలిస్టిక్ క్షిపణులను సమకూర్చుకుంది. ఇవి జలాంతర్గాముల నుంచి ప్రయోగించే అస్త్రాలు.
- ట్రైడెంట్ క్షిపణులను నాలుగు వాన్‌గార్డ్ తరగతి అణు జలాంతర్గాముల్లో బ్రిటన్ మోహరించింది. ఒక్కో సబ్‌మెరైన్ 16 క్షిపణులను మోసుకెళ్లగలదు. స్కాట్లాండ్‌లోని క్లైడ్ నౌకా స్థావరం కేంద్రంగా ఈ జలాంతర్గాములు పనిచేస్తున్నాయి. పోరాట సన్నద్ధతలో భాగంగా కనీసం ఒక సబ్‌మెరైన్ ఎప్పుడూ సముద్రంలో ఉండేలా బ్రిటన్ జాగ్రత్త వహిస్తోంది.
- మొత్తంమీద బ్రిటన్ వద్ద 58 ట్రైడెంట్ క్షిపణులు ఉన్నాయి.
రోడెక్కిన బ్రిటన్ అణు వార్‌హెడ్‌లు
British Army Nuclear Warheads
పుతిన్ అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తారా?
ఉక్రెయిన్‌పై యుద్ధం.. తాను ఆశించిన స్థాయిలో జరగడంలేదని అసహనంగా ఉన్న పుతిన్ అణ్వస్త్రాలను బూచిగా చూపుతూ హెచ్చరికలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బ్రిటన్ సహా నాటో కూటమి లక్ష్యంగా చిన్నపాటి ‘ట్యాక్టికల్’ అణ్వస్త్రాలను రష్యా ప్రయోగించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా బ్రిటన్ అణు వార్‌హెడ్‌లను సన్నద్ధం చేస్తోందని సమచారం. నాటోలోని ఒక్క సభ్య దేశంపై దాడి చేసినా.. కూటమిలోని దేశాలన్నీ స్పందించాలన్న ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలో రష్యా అణుదాడిని తిప్పికొట్టడాని నాటో దేశాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ట్రైడెంట్‌లో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ ఎంట్రీ వెహికిల్స్ (ఎంఐఆర్‌వీ)లు ఉంటాయి. ఇవి వేర్వేరు వార్‌హెడ్‌లు. అవి విడివిడిగా భిన్న లక్ష్యాలపై విరుచుకుపడగలవు. శత్రువును బోల్తా కొట్టించేందుకు ఉత్తుత్తి వార్‌హెడ్ (డికాయ్) కూడా ఇందులో ఉంటుంది.
ఇదీ చదవండి:Russia Ukraine War: పుతిన్ ప్రియురాలికి ఆ దేశంలో కష్టాలు!